కోదండరామ్ పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ.. ఆ పార్టీ సపోర్ట్ చేస్తే గెలుపు సులభమా?

by GSrikanth |   ( Updated:2023-09-05 03:48:53.0  )
కోదండరామ్ పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ.. ఆ పార్టీ సపోర్ట్ చేస్తే గెలుపు సులభమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు వేరు ఈ ఒక్క నియోజకవర్గం వేరు. ఇక్కడి నుంచి గెలిస్తే కీలక పదవులు ఖాయం అనే సెంటిమెంట్ ఉండటంతో ఈ స్థానంలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు స్కెచ్‌లు వేసుకుంటున్నాయి. ఆ నియోజకవర్గమే మేడ్చల్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి మల్లారెడ్డి మరోసారి బరిలో నిలవబోతుండగా ఆయన్ను ఓడించబోయేది తామంటే తామే అని పార్టీల మధ్య పోటీ పెరిగిపోతున్నది. ఇప్పటికే పలువురు మల్లారెడ్డిపై సై అంటుంటే తాజాగా తెరమీదకు మరో కొత్త పేరు వినిపిస్తోంది. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్‌ పేరును ఆ పార్టీ కేడర్ ప్రతిపాదిస్తున్నది. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నిక్లల్లో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించాలంటే ఉమ్మడి అభ్యర్థుల ప్రతిపాదనలు చర్చకు వస్తున్న నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి కోదండరామ్ బరిలో దిగితే బాగుంటుందని టీజేఎస్ కేడర్, నేతలు కోరుకుంటున్నట్లు సమాచారం. ‘కాంగ్రెస్‌‌తో మా సార్‌కు తత్సంబంధాలు ఉన్నాయి.. ఆ పార్టీ సపోర్ట్ చేస్తే కోదండరామ్ సారే గెలుస్తారు..’ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ మద్దతు దక్కేనా?:

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడి నుంచి గెలిచేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ తరపున మంత్రి మల్లారెడ్డికే మరోసారి టికెట్ లభించగా కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం జంగయ్య యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీజేపీ తరపున పోటీకి మురళీధర్‌రావు వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోణపలు, పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నందున కోదండరామ్ వంటి విద్యావేత్తకు అవకాశం ఇస్తే గెలుపు తథ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మేడ్చల్ బరిలో కోదండరామ్ ఉంటే ఆయనకే కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

మేడ్చల్‌తో పాటు కేసీఆర్ పోటీ చేయబోయే గజ్వేల్‌లోనూ కోదండరామ్ పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు కాంగ్రెస్ మద్దతిస్తే ఆ స్థానంలో బీఆర్ఎస్‌ను ఓడించడం మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. తాను పోటీ చేయబోయే స్థానాలపై రకరకాల వాదనలు తెరమీదకు వస్తుంటే కోదండరామ్ మాత్రం మౌనమే సమాధానం అన్నట్లుగా ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదింపడమే తమ ముందున్న టార్గెట్ అని పదే పదే చెబుతున్న ప్రొఫెసర్ ఎన్నికల్లో పోటీ విషయంపై ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed