బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి కన్ఫార్మ్.. ఈటలతో చర్చలు

by Javid Pasha |   ( Updated:2023-09-14 10:09:01.0  )
బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి కన్ఫార్మ్.. ఈటలతో చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వలసల రాజకీయం మొదలైంది. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. బలమైన నేతలను చేర్చుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్దమవ్వగా.. కాంగ్రెస్, బీజేపీలోకి చేరికల పర్వం నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లోకి చేరికలు పెరగ్గా.. తెలంగాణ బీజేపీ కూడా దూకుడు పెంచుతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తుంది.

ఈ క్రమంలో మాజీ మంత్రి జక్కుల చిత్తరంజన్ దాస్‌ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తాజాగా ఆయనను బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ కలిశారు. నేరుగా చిత్తరంజన్ దాస్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు ఇరువురి భేటీ జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన చిత్తరంజన్ దాస్ ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కే కల్వకుర్తి టికెట్ కేటాయించడంతో చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

బీఆర్ఎస్‌కు అంటీముట్టనట్లుగా ఉంటున్న చిత్తరంజన్ దాస్‌ను బీజేపీలో చేరాల్సిందిగా ఈటల ఆహ్వానించారు. అయితే బీజేపీలో చేరడంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటూ ఈటలకు ఆయన చెప్పారు. ఈటలతో భేటీ అనంతరం చిత్తరంజన్ దాస్ మాట్లాడాడుతూ.. బీజేపీలోకి ఈటల ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న చిత్తరంజన్ దాస్ ఈటల చర్చలతో త్వరలో కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed