వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్!

by GSrikanth |
వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. గతకొంత కాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్సీ, ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. రేపు(23-09-2023) ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ దక్కడంతో.. అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే వేముల వీరేశం చేరిక కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి చేరిక జరిగిపోయింది. అప్పటి నుంచి పొంగులేటి ద్వారానే వీరేశం కాంగ్రెస్‌లోకి వెళతారని అనుకున్నారు.

అధిష్టానం నుంచి ఏమైనా కబురు వస్తుందేమో అని వేచి చూశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో పాటు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే అనే అభిప్రాయంతో ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. చివరకు చేరికకు సిద్ధమయ్యారు. అయితే, నకిరేకల్‌లో ఇప్పటికే ముగ్గురు నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో దైద రవీందర్, వేదాసు శ్రీధర్‌లు కోమటిరెడ్డి అనుచరులు కాగా, కొండేటి మల్లయ్య జానారెడ్డి అనుచరుడు. మరి కాంగ్రెస్‌లో చేరాక వీరేశానికి టికెట్ వస్తుందో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed