బీఆర్ఎస్‌పై ముస్లింలు సీరియస్.. మచ్చిక చేసుకునేందుకు వరాలు!

by GSrikanth |
బీఆర్ఎస్‌పై ముస్లింలు సీరియస్.. మచ్చిక చేసుకునేందుకు వరాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ గులాబీ బాస్‌లో గాభరా పెరిగింది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన అధినేత.. ఇప్పుడు ఎలక్షన్స్‌లో ఓట్లు రాబట్టుకునేందుకు వివిధ సామాజిక వర్గాలను ఎలా ఆకర్షించాలనే దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. కొన్ని నెలలుగా ముస్లింలు కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులవుతున్నట్టు పార్టీ జరిపిస్తోన్న సర్వేల్లో స్పష్టం కావడంతో.. వారి ఓట్లు చేజారకుండా ఆ వర్గం మత పెద్దలను ఆశ్రయించాలని పార్టీ నేతలకు ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు వారితో ములాఖాత్ అయ్యేందుకు ఆహ్వానం పంపినట్టు సమాచారం. ఈసారీ తమ పార్టీకే సపోర్ట్ చేయాలని వారిని ప్రాథేయ పడనున్నట్టు సమాచారం. అయితే మత పెద్దల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని తెలిసింది.

30 సెగ్మంట్లలో ముస్లిం ఓటర్లు కీలకం

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ వర్గం ఓటర్లు గంపగుత్తగా ఏ పార్టీకి ఓటు వేస్తే.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉన్నది. అయితే ఈ మధ్య ముస్లింలు మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపుకు ఆకర్షితులవుతున్నట్టు టాక్ ఉన్నది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పెద్దలు ఎలాగైనా ఆ వర్గం ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అందు కోసం మత పెద్దల సహాయం కోరుతున్నట్టు తెలిసింది.

నిరాకరిస్తున్న మత పెద్దలు

కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న ముస్లింలకు ఆ వర్గం మత పెద్దల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే, అందుకు మత పెద్దల నుంచి సానుకూలత రావట్లేదని ప్రచారం జరుగుతున్నది. కొన్ని రోజులుగా ప్రగతిభవన్‌కు రావాలని ఆహ్వానం పంపుతున్నా అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్సూ రావడం లేదని టాక్. దీంతో బీఆర్ఎస్ పెద్దలు మజ్లీస్ లీడర్ల సాయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే, గతంలో ఎంఐఎం లీడర్ల సూచనలతో ప్రగతిభవన్‌కు వచ్చిన మత పెద్దలు ఈసారి గులాబీ పార్టీ ఆహ్వానం విషయంలో గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.

మచ్చిక చేసుకునేందుకు వరాలు

కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా కష్టపడుతున్నది. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం ఇస్తామని ప్రకటించింది. అయినా ఆ వర్గం ప్రజల్లో అనుకున్నంత మేరకు పాజిటివ్ రాలేదని టాక్ ఉన్నది. మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది ఇమామ్‌లు, మౌజంలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.5,000 గౌరవ వేతనం ఇస్తున్నది. పెండింగ్‌లో ఉన్న 7,000 దరఖాస్తులను క్లియర్ చేసి వారికీ ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతం ఇచ్చేందుకు జీవో జారీ చేసింది. ఆధునిక వసతులతో గ్రేవ్ యార్డు నిర్మించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో 125 ఎకరాల భూమినీ కేటాయించారు.

Advertisement

Next Story

Most Viewed