మాకూ సీట్లివ్వండి.. ఆగమేఘాల మీద ఢిల్లీకి లీడర్లు!

by GSrikanth |
మాకూ సీట్లివ్వండి.. ఆగమేఘాల మీద ఢిల్లీకి లీడర్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉదయపూర్ డిక్లరేషన్‌ను దేశమంతటా ఇంప్లిమెంట్ చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ప్రకటించింది. పార్టీ అగ్రనేతలు మొదలుకొని, గ్రౌండ్ లెవల్ లీడర్ల వరకు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఉదయపూర్ డిక్లరేషన్ అనగానే ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అనే ప్రధాన అంశమే తెరమీదకు వస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు కూడా టికెట్లు ఇవ్వాలనేది డిక్లరేషన్‌లో ఉన్నది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేతలు హైకమాండ్ ముందు ప్రతిపాదిస్తున్నారు. కొన్నిరోజులుగా రాష్ట్ర ముఖ్యనేతలకు వివరించినా లైట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ అనుబంధ సంఘాల నేతల్లో కొందరు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గతంలో ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీకి లేఖ రాశారు. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీట్ల పంచాయితీ తేల్చుకునేందుకు ఆయా సంఘాల లీడర్లు హస్తిన బాట పట్టారు.

పార్టీకి కీలకం..

కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్‌ను గ్రౌండ్ లెవల్‌లో సక్సెస్ చేయడంలో అనుబంధ సంఘాలే కీలకం. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలతో మమేకం చేసేందుకు ఈ సంఘాలే ముందుండి నడిపిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గతంలో ఉదయపూర్ డిక్లరేషన్‌లోనూ సంఘాలకు టికెట్లు ఇవ్వాలనే అంశాన్ని పొందుపరిచారు. అయితే పార్టీలో ప్రస్తుతం ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, చేనేత విభాగం, గిరిజన సంఘాలు, ఎస్సీ సెల్, ఫిషరీస్ విభాగం, ఎన్ఆర్ఐ సెల్, వికలాంగుల విభాగం వంటి సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. తమకు కూడా టికెట్లు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు కోరుతున్నారు.

ఆశిస్తున్నది వీళ్లే..

ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు తప్పా పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న మరెవ్వరికీ టికెట్లపై స్పష్టత లేదు. ఆదివాసీ, గిరిజన సంఘాల నుంచి బెల్లయ్య నాయక్ మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శివసేనారెడ్డి వనపర్తి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముషీరాబాద్, చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్ సిద్దిపేట, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గోషామహల్, వికలాంగుల చైర్మన్ ముత్తనేని వీరయ్య మిర్యాలగూడ, ఎస్సీ సెల్ నుంచి ప్రీతమ్ నకిరేకల్ లేదా తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్‌ను పరిగణలోకి తీసుకొని తమకు టికెట్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed