అసలు కసరత్తు ప్రారంభించనున్న బీజేపీ తెలంగాణ

by GSrikanth |
అసలు కసరత్తు ప్రారంభించనున్న బీజేపీ తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టిసారించనుంది. ప్రతీ ఓటును ఒడిసి పట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. ప్రతీ ఒక్క ఓటు ఎంతో ముఖ్యమని, ఏ మాత్రం అలసత్వం వహించవద్దని కమలనాథులు భావిస్తున్నారు. బూత్‌ల వారీగా ఓటర్లను పలు దఫాలుగా కలిసిన కమలనాథులు చివరి రెండ్రోజుల్లో వారు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు. సమన్వయం బాధ్యతల కోసం బూత్‌ ఇన్‌చార్జీలను బీజేపీ నియమించింది. కాగా ఇప్పటికే బీజేపీ మద్దతుదారులెవరు? ఇతర పార్టీల వారెవరు? న్యూట్రల్‌గా ఉన్నవారెందరు? అని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

ఓటర్లను ఆకర్షించే ప్లాన్

మద్దతుదారుల ఓట్లు ఎలాగూ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లను తమవైపు డైవర్ట్ చేయడంపై కాషాయ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇతర పార్టీలకు మద్దతుదారులుగా ఉన్న వారిని సైతం వీలైనంత వరకు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పట్టణాల్లో అయితే గేటెడ్ కమ్యూనిటీల వారీగా బీజేపీ పలు సమావేశాలు నిర్వహించింది. అలాగే గ్రామీణ ప్రాంత ఓటర్లపైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి పట్టున్నా.. ఈసారి గ్రామీణ ప్రాంతానికి చెందిన సెగ్మెంట్లలోనూ సత్తా చాటాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది. యువత, నిరుద్యోగులు, మహిళల ఓట్లు తమకు కలిసొచ్చే అవకాశముందని కమలనాథులు భావిస్తున్నారు. సమీకరణ, ఇతర అంశాల వారీగా విభజించి మరీ బీజేపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బీజేపీ నిమగ్నమైంది.

మోడీ భరోసా

ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి. అగ్ర నేతల ప్రచారం సైతం క్లోజ్ అవ్వనుంది. దీంతో ఓటర్లకు ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా ఆయా పార్టీలు అప్రోచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాయి. తమ పార్టీకే ఓటు వేయాలని ఫోన్ కాల్స్ ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు నిమగ్నం అయ్యాయి. ఇదిలా ఉండగా మోడీ సభలు తమకు కలిసొస్తాయని కాషాయపార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా పర్యటనల సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఇటీవల మోడీ పలువురు నేతలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రతీ ఇంటి తలుపు తట్టాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. ఒక్కో కార్యకర్త వందమంది ఓటర్లను కలిసేలా వ్యూహంగా వెళ్లాలని, సమయం వృథా చేయొద్దని సూచించినట్లు సమాచారం. నేతలు పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుందని మోడీ భరోసాను కల్పించినట్లు తెలిసింది. ఓ వైపు అగ్రనేతల ప్రచారం, మరోవైపు శ్రేణుల్లో మోడీ నింపిన భరోసా ఎంత మేరకు వర్కవుట్ అవుతాయో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed