రాష్ట్రంలో మొదలైన పొలిటికల్ హీట్.. మూడు పార్టీల పోటాపోటీ ప్రోగ్రామ్స్!

by GSrikanth |
రాష్ట్రంలో మొదలైన పొలిటికల్ హీట్.. మూడు పార్టీల పోటాపోటీ ప్రోగ్రామ్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్న మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాయి. పోటాపోటీ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుడుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో రకమైన కార్యక్రమంతో శుక్రవారం మొదలు సోమవారం వరకు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది. ప్రారంభోత్సవాల పేరుతో బీఆర్ఎస్, పార్టీ సమావేశాలతో కాంగ్రెస్, విమోచనోత్సవం పేరుతో బీజేపీ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వేదిక ఏదైనా పొలిటికల్ ప్రసంగాలు, స్టేట్‌మెంట్లతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోడానికి ఈ ప్రోగ్రామ్‌లను ఆ పార్టీల నేతలు వాడుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే వారి ప్రధాన ఉద్దేశం. ఏ కామెంట్‌కు ఎవరు ఎలా కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సర్కారు నిధులతో పబ్లిసిటీ పొందాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఒకేసారి తొమ్మిది జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని పెట్టామన్న మెసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోయినప్పటికీ పాక్షికంగా పనులు పూర్తయిన ప్యాకేజీకి శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలకు కౌంటర్‌గా నార్లాపూర్ దగ్గర ప్రారంభోత్సవం చేసి అక్కడే ప్రజలను ఉద్దేశించి బహిరంగసభలో ప్రసంగించనున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలను భారీ స్థాయిలో తరలించి ఈ సభ ద్వారా బల ప్రదర్శన చేయాలనుకుంటున్నారు. పాలమూరును ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, సకాలంలో పూర్తికాకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డం పడింది కూడా ఈ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలేనని విమర్శించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేసినందువల్లనే ఆశించిన స్థాయిలో పురోగతి లేకుండా పోయిందంటూ బీజేపీని కూడా సీఎం టార్గెట్ చేయనున్నారు. రెండు పార్టీలను రాజకీయంగానే విమర్శించడానికి ఈ వేదికను సీఎం వాడుకోనున్నారు.

మరోవైపు వర్కింగ్ కమిటీ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో శనివారం నిర్వహిస్తున్నది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నదని, కర్ణాటకలో గెలుపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అనుకూలంగా మారిందని భావిస్తున్న కాంగ్రెస్ ఈ సమావేశాల ద్వారా క్షేత్రస్థాయిలో బలపడాలనుకుంటున్నది. సీడబ్ల్యూసీ సమావేశాల ద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన దిశానిర్దేశాన్ని పీసీసీ నేతలకు కాంగ్రెస్ అందించనున్నది. రాష్ట్ర సీనియర్ నేతలతోపాటు వివిధ కమిటీల్లో ఉన్నవారితో సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం కూడా తెలంగాణ అంశాల కేంద్రంగా జరగనున్నది. ఆ తర్వాత తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగసభలో సోనియాగాంధీ ఇచ్చే ప్రసంగం ప్రజల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఒక వేవ్‌కు దోహదపడుతుందనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజల్లో బలమైన అభిప్రాయం నెలకొన్న సమయంలో విమోచనా దినోత్సవాన్ని నిర్వహించి పొలిటికల్‌ వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకోవాలన్నది కమలనాథుల ప్లాన్. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా జరిపే విమోచనా దినోత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నది. మజ్లిస్ పార్టీ కూడా ఈ నినాదాన్నే ఎత్తుకున్నారు. రెండు పార్టీలూ మిత్రపక్షాలుగా ఉన్నందున బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉన్నదంటూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందు, ముస్లిం ఓటు బ్యాంకును కన్సాలిడేట్ అయ్యేలా ప్రసంగించే అవకాశమున్నది.

రాష్ట్రంలో శుక్రవారం మొదలు సోమవారం వరకు నాలుగు రోజుల పాటు పొలిటికల్ హీట్ ఊహకు అందనంత స్థాయిలో చోటుచేసుకునే అవకాశమున్నది. ఎవరికి ఎవరు ఎలాంటి సవాళ్లు విసురుతారో.. దానికి ఏ తీరులో కౌంటర్ ఇస్తారో.. ఎవరికి ఏ రూపంలో ఎక్కువ మైలేజీ వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. ఏ సభకు ఎక్కువ మంది జనం హాజరవుతారో.. దేనికి ప్రజల నుంచి ఎక్కువ స్పందన వస్తుందో.. ఇలాంటి చర్చలూ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో డైలమా కొనసాగుతున్నప్పటికీ మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రం పోటీ తీవ్రంగానే నెలకొన్నది. సభలకు హాజరయ్యే జనాన్ని నియంత్రించడం, వీఐపీ సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రోటోకాల్ పేరుతో రోడ్లను బ్లాక్ చేసే ఆంక్షలు స్థానికులకు ఇబ్బందికరం కానున్నది.

Advertisement

Next Story

Most Viewed