27 మంది ఆత్మహత్య చేసుకున్నా బీఆర్ఎస్లో చలనం లేదు.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల

by Javid Pasha |
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా దొరకు పట్టింపు లేదని, ఉన్నత విద్యకు నిలయాలైన ట్రిపుల్ ఐటీలను ఆత్మహత్యలకు నిలయంగా మార్చాడని కేసీఆర్ పై మండిపడ్డారు. గొప్ప ఆశయాలతో వచ్చిన పేద విద్యార్థులకు పురుగుల అన్నం, మురుగు నీరు పెట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని, సర్కారు నియమించిన డైరెక్టర్లు కేసీఆర్ లాగే డుమ్మాలు కొడుతున్నారని అన్నారు. ‘‘సిబ్బంది నియామకాలను మరిచారు. క్యాంపస్ ల నిర్వహణను గాలికొదిలేశారు. నిధుల కేటాయింపులను గంగలో కలిపేశారు. ఇంచార్జ్ అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పబ్బం గడుపుతున్నారు’’ అని అన్నారు.

ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల కింద ఊదరగొట్టే మాటలు మాట్లాడిన తండ్రీకొడుకులు.. మరునాడే పత్తా లేకుండా పోయారని చెప్పారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని వైఎస్ఆర్ ట్రిపుల్ ఐటీలను స్థాపిస్తే.. కేసీఆర్ మాత్రం ట్రిపుల్ ఐటీలపై నమ్మకమే లేకుండా చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. ఇప్పుడు సీటు కోసం అప్లై చేసుకోవడం కూడా మానేశారని చెప్పారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్ల పేద బిడ్డలకు ఉన్నత విద్య అందకపోగా.. ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలని, మరో విద్యార్థి ప్రాణం పోకముందే సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed