VC.Sajjanar: ఇకపై అలా చేయను! సజ్జనార్ ట్వీట్‌తో మనసు మార్చుకున్న యూట్యూబర్

by Ramesh N |
VC.Sajjanar: ఇకపై అలా చేయను! సజ్జనార్ ట్వీట్‌తో మనసు మార్చుకున్న యూట్యూబర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC.Sajjanar) ట్వీట్‌తో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన ఓ యూట్యూబర్ మనసు మార్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన లోకల్ బాయ్ నాని (Local Boy Nani) అనే యూట్యూబర్ ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడంతో వీసీ సజ్జనార్ ఆ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, ఇవేం దిక్కుమాలిన పనులు, ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను ఆపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని స్పందించాడు.

తన తప్పును నిజాయితీగా ఒప్పుకుని క్షమించండంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇకపై బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేయనని, ప్రమోట్ చేస్తే సోషల్ మీడియా నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పిన నాని పేర్కొన్నారు. ఈ వీడియో సైతం వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ అభినందనలు తెలిపారు. ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్న ఆన్ లైన్ బెట్టింగ్ ను ఇక నుంచి ప్ర‌మోట్ చేయ‌న‌ని నాని ప్ర‌క‌టించడం అభినంద‌నీయమని సజ్జనార్ తెలిపారు. మిగ‌తా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లు కూడా నాని లాగే స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని ఇక నుంచైనా బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ఆపండని సూచించారు. 'మేం అలానే చేస్తాం.. మా ఇష్టం' అనుకుంటే మీపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వని హెచ్చరించారు.

Next Story