ఉక్కిరిబిక్కిరవుతున్న CM జగన్.. ఓటమికి సంకేతాలతో దెబ్బతింటున్న ఆత్మస్థైర్యం

by GSrikanth |   ( Updated:2024-02-17 03:20:09.0  )
ఉక్కిరిబిక్కిరవుతున్న CM జగన్.. ఓటమికి సంకేతాలతో దెబ్బతింటున్న ఆత్మస్థైర్యం
X

ఓడలు బళ్లు కావడమేంటే ఇదే..! గత ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశముందా అంటే.. ఆ పార్టీ నేతలే ధైర్యంగా జవాబు చెప్పలేకపోతున్నారు. స్వయంకృతాపరాధాలతో కొంతకాలంగా జగన్ పార్టీకి అన్నీ ఎదురు దెబ్బలే తగులు తున్నాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమికివేమైనా సంకేతాలా అనే అనుమానాలు వారిలో బలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిస్తోంది. పలువురు ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లివ్వడం, మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేయడం వంటి పరిణామాలతో చాలామంది నేతలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీల వైపు చూస్తున్నారు.

దిశ ప్రతినిధి, అనంతపురం: అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ నాయకులు ఇంతకాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలనలో.. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలు, కబ్జాలు, అవినీతి వంటి అక్రమాలకు కొదువ లేదు. ప్రతిపక్ష నేతలను మాటల్లో చెప్పలేనంత తీవ్ర పదజాలంతో దూషించారు. బూతులతో విరుచుకుపడ్డారు. అక్రమ అరెస్టులకు సైతం తెగబడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో పరిస్థితులు మారుతున్నాయి. ఇంతకాలం అధికార పార్టీ చెప్పుచేతల్లో ఉన్న పోలీసులు, ఇతర అధికారులు ఇప్పుడు ఎంతో కొంత నిష్పాక్షికత ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. స్వరం పెంచుతున్నాయి. అధికార పక్షంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.

దెబ్బ మీద దెబ్బ..

రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సినిమా విడుదలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే అది ఒక్క రోజుకే పరిమితమైంది. సినిమా విడుదలకు శుక్రవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీ ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇవ్వడంతో అధికార వైసీపీకి మరో పెద్ద దెబ్బ తగిలినట్లయింది. రాష్ట్రంలో రూ.529 కోట్ల బాండ్లుండగా.. అత్యధికంగా 382 కోట్లు ఆ పార్టీవే కావడం గమనార్హం. పైగా, అధికార పార్టీ అయినందున క్విడ్ ప్రోకో బాగోతాలు ఏమైనా బయటపడే అవకాశ ముంటుంది. ఇది కూడా ఆ పార్టీ శ్రేణులను కలవరపరిచే అంశమే.

ఈసీ షాకులు..

తాము నియమించిన సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందుదామనుకుంటే వారి సేవలను ఇంకు పూయడం లాంటి నామ మాత్రపు పనులకే పరిమితం చేయడం ద్వారా ఈసీ షాకిచ్చింది. అలాగే, వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చి పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది. ఉపాధ్యా యులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిస్తే.. అందుకు భిన్నంగా వారి సేవలను వినియోగించుకోవాలని ఈసీ నిర్ణయించడం జగన్ పార్టీకి దెబ్బే.

అధికారుల్లో భయం భయం..

అధికారుల సాయంతో తప్పుడు పద్ధతుల ద్వారా దొంగ ఓట్లు నమోదు చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తే అదీ బెడీసికొట్టింది. గతంలో అప్పటి తిరుపతి కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, ఇద్దరు అనంతపురం జడ్పీ సీఈవోలు, పలువురు కిందిస్థాయి అధికారులు, చివరికి కొందరు పోలీసులు సైతం సస్పెన్షన్ కు గురయ్యారు. తద్వారా సాధారణ ఎన్నికల్లో మళ్లీ అలాంటి పని చేయాలంటే అధికారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎంతగా ప్రయత్నిస్తున్నా వ్యూహం సినిమా ఇప్పటి వరకు విడుదల కాకపోవడం, యాత్ర-2 ప్లాప్ కావడం, రాజధాని ఫైల్స్ సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ లభించడం, సోదరి షర్మిల ఎదురు తిరగడం వైసీపీకి ఆందోళన కలిగించే అంశాలే.

బెడిసికొట్టిన స్కిల్ కేసు..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలోనూ వైసీపీకి ఎదురు దెబ్బలే తగిలాయి. స్కిల్ కేసులో ఆయనను అరెస్టు అయితే చేయగలిగారు గానీ, దాని ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని చెప్పవచ్చు. కోర్టులో అవినీతికి సాక్ష్యాలు చూపించలేకపోగా, టీడీపీ శ్రేణులు, అభిమానుల్లో కసి, పోరాట పటిమ పెంచినట్లయింది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెట్టడం కక్ష సాధింపులో భాగమేనని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. కోర్టులో బెయిల్ రాకుండా ఎంతగా అడ్డుకుందామని చూసినా కుదరలేదు.

చేజేతులా..

ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే అంశం కూడా వైసీపీని బాగా ఇరకాటంలో పెట్టింది. కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం, మరికొందరిని నియోజకవర్గాల సరిహద్దులు దాటించడం ఆ పార్టీలో పెను దుమారమే రేపింది. కొంతమంది తిరుగుబాటు చేశారు. మరి కొంతమంది పార్టీ మారారు. ఇంకొందరు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మొత్తమ్మీద పార్టీలో అంతా గందరగోర పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో పలు అంశాలు బీ ఆర్ఎస్ పార్టీ విజయావకాశాలపై అనుమానాలు పెంచాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందులో ముఖ్యమైనవి. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా ఇలాంటి అనేక అంశాలు పార్టీ గెలుపుపై ఆ పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలు కలిగిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed