‘బలగం’ సినిమాతో ఎల్ఈడీ స్క్రీన్‌, డీజే బాక్స్‌లకు భలే గిరాకీ

by Sathputhe Rajesh |
‘బలగం’ సినిమాతో ఎల్ఈడీ స్క్రీన్‌, డీజే బాక్స్‌లకు భలే గిరాకీ
X

దిశ, ప్రతినిధి సూర్యా పేట : బలగం సినిమా ఎల్ఈడి, స్క్రీన్‌లకు, డీజే బాక్స్‌ల‌కు భలే గిరాకి తెచ్చిపెట్టింది. లవకుశ సినిమా సమయంలో ఊరురా డ్రామాలు వేస్తూ కనువిందు చేసేవారు. మళ్లీ 70 సంవత్సరాల తర్వాత గ్రామ గ్రామాన ఎల్‌ఈ‌డీ స్క్రీన్‌లతో డిజే సౌండ్లతో బలగం సినిమా ప్రదర్శించబడుతుంది. 20 సంవత్సరాల క్రితం నాటి తెలంగాణ పల్లెటూరిని చూడాలంటే బలగం సినిమా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కమర్షియల్ సినిమాల ఊబిలో చిక్కుకోకుండా అచ్చమైన తెలంగాణ సినిమా రావాలనుకున్న వాళ్ళ కల మరొక్కసారి ఈ చిత్రంతో నెరవేరినట్టు అనిపిస్తుంది.

ప్రస్తుతం పల్లెలు మారుతున్నాయి. పట్టణాల్లో అనుక్షణం అడుగడుగునా కనిపించే స్వార్థం, సంకుచితత్వం పల్లెలను కూడా మింగివేస్తుంది అనే నేపథ్యాన్నీ ఈ సినిమాలో చూపెట్టారు. పల్లెటూర్ల మానవీయ బంధాలను మహమ్మారిలా తుడిచిపెట్టుతుందని, ఇంటి పెద్ద చావులోనూ ఎవరి స్వార్థం మేరకు వాళ్లు ఆలోచించడం, పైసలు, పంపకాల చుట్టే మనుషుల బూటకపు ప్రేమలు, స్వార్థపు ఆటలు సహజమైపోయాయనే కోణంలో ఈ సినిమా ఉంటుంది. కట్టె కాలకముందే కాసుల పంపిణీ, పంట పొలాల వాటలు సాధారణమైపోయాయని, సరిగ్గా చితిమంటల సాక్షిగా మనసులను కాల్చి వేస్తున్న ఈ స్వార్థపర చింతన పైన బలగం సినిమా బలమైన ఆస్త్రాన్ని ఎక్కు పెట్టి ప్రజలకు చొచ్చుకొని వెళ్ళింది.

ఈ సినిమాని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గ్రామాల నుండి పెద్దమనుషులు రాజకీయ నాయకులు ఈ సినిమాన్నీ గ్రామాలలో, మున్సిపాలిటీ పరిధిలో ప్రదర్శించడానికి సుముఖంగా ఉండి ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ వార్డులలో ఓరోజు సినిమాని గ్రామ పెద్దలు దగ్గర ఉండి ప్రజలతో మమేకమై చూస్తున్నారు. ఈ సినిమా చూస్తున్న అనంతరం మహిళలు, వృద్ధులు కంటతడి పెడుతున్నారు. రాష్ట్రంలో పొలం పంచాయతీ వల్ల విడిపోయిన అన్నదమ్ములు మళ్లీ ఈ సినిమా చూసి కలిసినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇలా గ్రామ గ్రామాన బలగం సినిమా ప్రదర్శించడంతో ఎల్ఈడి స్క్రీన్‌లకు, డీజే బాక్స్‌ల ఓనర్లకు గిరాకీ పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ లేకపోవడంతో ఎల్ఈడి వాల్ స్క్రీన్లు ,డిజే బాక్సులు ఇంట్లో మూలకు పడ్డాయి. బలగం సినిమాతో ఎల్ఈడీ వాల్, డీజే బాక్స్‌లకు గిరాకీ రావడంతో ఓనర్లు లాభాల బాటలో ప్రయాణిస్తున్నారు. 8/12 ఎల్ఈడి స్క్రీన్, డి జె బాక్సులతో పదిహేను వేల రూపాయలు, 6/8 ఎల్ఈడి స్క్రీన్ డీజే బాక్స్‌ల‌కు రూ.పది వేలు ఛార్జ్ చేస్తూ లాభాలు పొందుతున్నారు. బలగం సినిమాకు గ్రామాల్లో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరిసిల్లకు చెందిన వేణు దర్శకత్వంలో నిజామాబాద్‌కు చెందిన నిర్మాత దిల్ రాజు, మహబూబాబాద్ బయ్యారం గ్రామానికి చెందిన బీమ్స్ పాటలు సమకూర్చి విజయాన్ని అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed