అందరి చూపు ఒవైసీ విద్యాసంస్థల వైపే.. హైడ్రా ఏం చేయబోతోంది..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-27 15:34:58.0  )
అందరి చూపు ఒవైసీ విద్యాసంస్థల వైపే.. హైడ్రా ఏం చేయబోతోంది..?
X

దిశ, చార్మినార్​ : ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్​కన్వెషన్‌ను​కూల్చి వేసిన హైడ్రా అధికారుల తదుపరి లక్ష్యం బండ్లగూడలోని సలకం చెరువులో అక్రమంగా నిర్మించిన ఒవైసీకి చెందిన విద్యా సంస్థలేనా ? అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన గూగుల్​మ్యాప్​ఇమేజ్​సోషల్​మీడియాలో వైరల్‌గా మారింది. ఒవైసీ కళాశాలను కూల్చి వేస్తారా? లేదా? కాంగ్రెస్​ ప్రభుత్వం, హైడ్రా అధికారులు వెనక్కి తగ్గుతారా? అన్నది నగరవాసుల్లో మిలియన్​డాలర్ల ప్రశ్నగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎంఐఎం పార్టీ చెప్పిందే శాసనంలా ప్రభుత్వాలు వింటూ వచ్చాయని, ఒవైసీ బ్రదర్స్‌ను కాదని విద్యాసంస్థలను కూల్చివేస్తే మాత్రం మజ్లీస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగానే భావించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకుముందు కిరణ్​కుమార్​ప్రభుత్వం ఒవైసీ బ్రదర్స్‌పై కఠినంగా వ్యవహరించారని, ప్రస్తుతం సలకం చెరువులో ఒవైసీ విద్యాలయాలను కూల్చివేయడం అంటూ జరిగితే మరోసారి అదే కాంగ్రెస్​ ప్రభుత్వం హయాంలోనే మజ్లిస్‌కు ఈ సారి తీరని ఆర్థిక నష్టం కలిగించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఒవైసీ బిల్డింగ్‌లు కూల్చివేస్తే హైడ్రా అధికారులు ఇక ఎవ్వరినీ వదిలే అవకాశమే లేదనే చర్చలు ఊపందుకోనున్నాయి. మరోవైపు ఒవైసీ తన స్వ ప్రయోజనాలకు కాకుండా సేవ పేరిట 40వేల మంది విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్న విద్యాలయాలను కూల్చివేయం ఎంతవరకు సబబనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

చెరువులో 70శాతం కబ్జా

పాతబస్తీ బండ్లగూడ విలేజ్‌లోని సలకం చెరువు (సూరం చెరువు ) 70శాతం కబ్జాకు గురైందని సోషల్​మీడియాలో ప్రచారం ఊపందుకుంది. 1979వ సంవత్సరం క్రితం నాటి మ్యాప్ ప్రకారం ... 0.37 చదరపు కిలోమీటర్ల పరిధిలో సలకం చెరువు విస్తరించి ఉండేదని, ప్రస్తుతం 0.111 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యింది. అయితే 0.258 చదరపు కిలోమీటర్ల కబ్జాకు గురైందని, సలకం చెరువులో 70 శాతం కబ్జా అని ఇప్పటికే హైడ్రా అధికారులు తేల్చినట్లు సమాచారం. 2014 కు ముందు చెరువు చుట్టూ ఎఫ్‌టీఎల్‌లో కొన్ని ప్రైవేట్​కట్టడాలు నిర్మించుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2014లో మాత్రం చెరువు మధ్యలో ఒవైసీకి చెందిన విద్యా సంస్థల భవన నిర్మాణాల కోసం మట్టితో పూడ్చి వేశారని, ఆ తర్వాత ఒవైసీకి చెందిన విద్యా సంస్థలతో పాటు కొన్ని ప్రైవేట్​ భవనాలను సైతం నిర్మించారని హైడ్రా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే హైడ్రా అధికారులు విడుదల చేసిన కబ్జాలకు గురైన 58 చెరువుల లిస్ట్‌లో బండ్లగూడలోని సలకం చెరువు కూడా ఉంది. దీంతో ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి వేసిన హైడ్రా అధికారుల తదుపరి లక్ష్యం సలకం చెరువు మధ్యలో నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలేనని, దానికి సంబంధించిన గూగుల్​మ్యాప్​ఇమేజ్ విస్తృతంగా వైరల్‌గా మారింది. దీనిపై రాజకీయ దుమారం లేపుతుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు హైడ్రా తగ్గేదేలేదని, కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదలమని హెచ్చరిస్తుండగా, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హైడ్రాపై ఘాటుగానే స్పందించారు. చివరికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ఒవైసీ సైతం అసవరమయితే నన్ను కాల్చేయండి... నా విద్యా సంస్థల జోలికి వస్తే బాగుండదనే హెచ్చరికల మధ్య రాజకీయ దుమారం లేపుతుంది.

హైడ్రాపై మండి పడ్డ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ

ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ సంస్థలను కూడా హైడ్రా కూల్చేస్తుందా? అని మజ్లిస్ పార్టీ చీఫ్, హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఒక దశలో హైడ్రాపై అసహనం వ్యక్తం చేశారు. హిమాయత్​సాగర్​ఎఫ్‌టీఎల్​పరిధిలో సీసీఎంబీ నిర్మించారని, గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్​కోర్టులో ఉందని, ఈ గోల్ఫ్​కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్​అధికారులు గోల్ఫ్ ఆడుతున్నారని, దానిని కూడా తొలగిస్తారా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని కూడా నాలాపై నిర్మించారని స్పష్టం చేశారు. హుస్సేన్​సాగర్ ఎఫ్‌టీఎల్​పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్‌ను కూడా తొలగిస్తారా ? అని ప్రశ్నించారు. FTL సమస్యపై జీహెచ్ఎంసీ మేయర్‌ను కలిపి ఫిర్యాదు చేస్తానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తానని అసదుద్దీన్​ పేర్కొన్నారు.

నన్ను కాల్చి పారేయండి.. నా స్కూల్‌ను మాత్రం కూల్చొద్దు..

మాపై కక్ష్య కట్టి, మాకు నోటీసులు ఇచ్చి, మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎంఐఎం శాసన సభ పక్ష నేత, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ఒవైసీ మండిపడ్డారు. పేద ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజలకు విద్యాబుద్దులు నేర్పించేందుకు ఏర్పాటు చేసిన కళాశాలను కూల్చే ప్రయత్నం చేయవద్దని, 40వేల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని, నేను చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దని హితవు పలికారు. కక్ష ఉంటే నాపై కాల్పులు జరపండి... బుల్లెట్ల వర్షం కురిపించండి... నన్ను చంపేయండి.. నన్ను ఏమయినా చేయండి... నాకు గత అనుభవాలు ఉన్నాయి.. మళ్లీ కాల్పులు జరిగినా నేను భయపడేది లేదు... నా కాలేజ్, స్కూల్​జోలికి రావద్దు... కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు. ఏమైనా చేయాలనుకున్నా నన్ను చంపేయండి అంటూ అక్బరుద్దీన్​ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కాలేజీని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తనను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదంటూ అక్బరుద్దీన్​ఒవైసీ హెచ్చరించారు. ఒకవేళ హైడ్రా అధికారులు కక్ష కట్టి కూల్చినా కుతుబ్​ మినార్​కంటే ఎత్తయిన భవనాలను నిర్మిస్తానని అక్బరుద్దీన్​ఒవైసీ స్పష్టం చేశారు.

ఎంతటి వారైనా భరతం పడుతాం..

జనహితం కోసం భవిష్యత్​తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణకు బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. లేక్​సిటీగా వర్దిల్లిన హైదరాబాద్​ నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్​ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. శతాబ్దాల కిందటే హైదరాబాద్‌ను చెరువుల నగరం (లేక్​ సిటీ)గా నాటి పాలకులు అభివృద్ధి చేశారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసంఫాం హౌస్‌లు కట్టి వ్యర్థ జలాలను వదులుతున్నారు. వీటిని విస్మరిస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్థమే అవుతుంది. అందుకే చెరువుల పరిరక్షణకు పూనుకున్నాం. కురు క్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునిడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఇది రాజకీయ కక్షల కోసం కానే కాదని, భవిష్యత్​ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చిన పట్టించుకోం. చెరువుల ఆక్రమణదారులు ఎంతటి వారైనా భరతం పడుతాం అని అక్రమార్కులకు ఘాటుగానే సీఎం వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story