- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS తొలి బహిరంగసభకు ఆ ఇద్దరు ఎందుకు రాలే?
దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగసభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు హాజరయ్యారు. కానీ ఇద్దరు కీలక నేతలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గులాబీ పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలనే ఆలోచన మొదలైనప్పటి నుంచీ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ (జేడీయూ), కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (జేడీఎస్)తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. బీఆర్ఎస్కు సంబంధించిన పలు కార్యక్రమాలకు హాజరైన కుమారస్వామి.. ఖమ్మం సభలో కనిపించలేదు. బీజేపీకి యాంటీగా ఉన్న నితీశ్ కుమార్ సైతం సభకు హాజరుకాలేదు. వీరిలో ఒకరు ఇన్విటేషన్ అందకపోవడం వల్లే సభకు రాలేకపోయానని క్లారిటీ ఇవ్వగా, యాత్రలో ఉన్నందున సభకు హాజరుకాలేకపోయానని మరొకరు వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక పోరులో నితీష్, కుమారస్వామి పొలిటకల్‌గా గట్టిగా కొట్లాడుతున్నారు. అదే వైఖరితో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వారిద్దరూ రాకపోవడం చర్చలకు దారితీసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక బలమైన రాజకీయ శక్తి అవసరం విషయమై గతేడాది మే నెలలో బెంగుళూరు వెళ్లిన కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆగస్టు చివరి వారంలో బిహార్ వెళ్లి సీఎం నితీవ్ కుమార్‌తోనూ చర్చించారు. అదే పర్యటనలో ఆర్జేడీ నాయకుడు లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌తో చర్చలు జరిపారు. తమిళనాడు వెళ్లి సీఎం స్టాలిన్‌తో, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌తో మాట్లాడారు. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రోగ్రామ్‌కు, ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్‌కు కుమారస్వామి మినహా ఇతర నేతలెవరూ హాజరుకాలేదు.
కారణాలేంటి?
ఖమ్మం సభకు హాజరైన ముగ్గురు సీఎంలలో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్) చెందినవారే. అటు బీజేపీతో, ఇటు కాంగ్రెస్‌తో దూరంగా ఉన్న ఆమ్ ఆద్మీ.. బీఆర్ఎస్ సభకు హాజరుకావడం గమనార్హం. కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సభకు హాజరైనా.. ఆ పార్టీ సైద్ధాంతికంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తోనే కలిసి ఉన్నది. యూపీఏ భాగస్వామిగా కంటిన్యూ అవుతున్నది. రానున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏ పొత్తుతోనే పోటీ చేయాలని భావిస్తున్నది. జేడీయూ, జేడీఎస్ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సభకు హాజరుకాకపోవడం.. భవిష్యత్తులో సంబంధాలను ప్రశ్నార్థకం చేసినట్టయింది. ఈ రెండు పార్టీలు ఇకపైన ఏ పార్టీతో కలిసి ప్రయాణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేర్వేరు విధానాలను అవలంబిస్తాయా? అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఆహ్వానం అందినా వెళ్లేవాడిని కాదు: బిహార్ సీఎం నితీశ్ కుమార్
బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లలేకపోవడంపై నితీశ్, కుమారస్వామి వేర్వేరుగా స్పందించారు. బీఆర్ఎస్ సభ గురించి తనకు తెలియదని, తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా వెళ్లేవాడిని కాదని బిహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం 'సమాధాన్ యాత్ర' చేపట్టానని, త్వరలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లడం వీలుపడదని తెలిపారు. ఖమ్మం సభకు సంబంధించి ఆహ్వానం అందుకున్న ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పంచుకున్నారని, దానిని కొత్త గ్రూపుగా తయారైనట్టుగా భావించడం లేదని స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఒక్కడిగా ఏర్పడి బలమైన శక్తిగా తయారుకావాల్సిన అవసరం ఉందని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు దగ్గర కావడానికి అన్ని అవకాశాలు లేకపోలేదని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
యాత్ర కారణంగానే: జేడీఎస్
బీఆర్ఎస్ అనే పేరును లాంఛనంగా ప్రకటించిన కార్యక్రమానికి, ఢిల్లీలో ఆ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరైన కుమారస్వామి.. ఖమ్మం సభకు హాజరుకాకపోవడం గులాబీ నేతలకే మింగుడు పడలేదు. ఆహ్వానం పంపామని, అక్కడి రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్నందునే కుమారస్వామి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 123 సీట్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో నవంబరు చివరి వారం నుంచి కుమారస్వామి పంచరత్న రథయాత్ర చేపట్టారు. ఖమ్మం సభ జరిగే రోజున ఉత్తర కర్ణాటకలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ యాత్ర కారణంగానే ఖమ్మం సభకు కుమారస్వామి హాజరుకాలేకపోయారని ఆ పార్టీ గురువారం బెంగుళూరులో ఓ ప్రకటన వెలువరించింది. కానీ బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవడం ద్వారా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒరిగేదేమీ ఉండదని, కొత్తగా ఎంటర్ అయ్యే ఆ పార్టీతో జేడీఎస్‌కు పెద్దగా కలిసొచ్చే ప్రయోజనం కూడా లేదని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే కామెంట్ చేశారు. కాంగ్రెస్‌తో స్నేహసంబంధాలున్నప్పటికీ ఈసారి ఒంటరిగా పోటీచేయాలనుకుంటున్నప్పుడు కొత్తగా బీఆర్ఎస్తో అలయెన్స్‌లోకి వెళ్లి ఏం సాధిస్తామన్న ప్రశ్నను లేవనెత్తారు. కర్ణాటకలో ప్రభావం చూపే శక్తి బీఆర్ఎస్కు లేనప్పుడు పొత్తు ద్వారా ఏం సాధిస్తామనే సందేహాన్నీ తెరపైకి తెచ్చారు. ఈ కారణంగానే పంచరత్న రథయాత్ర సాకుతో బీఆర్ఎస్ సభకు ఉద్దేశపూర్వకంగానే కుమారస్వామి హాజరుకాలేదన్న అనుమానాలు తలెత్తాయి.
Also Read...