ఇదేం విచార‌ణ‌..? ఐన‌వోలు బీసీ గురుకులంలో నామ్ కే వాస్తే తనిఖీలు

by Sathputhe Rajesh |
ఇదేం విచార‌ణ‌..? ఐన‌వోలు బీసీ గురుకులంలో నామ్ కే వాస్తే తనిఖీలు
X

వరంగల్​జిల్లా ఐనవోలు మండలం బీసీ గురుకులంలో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఘటనపై ‘దిశ’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి సైతం ‘దిశ’ తీసుకెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు గురుకులం తనిఖీ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని ఆదేశించారు. ఈ మేరకు డీసీవో మనోహర్​రెడ్డిని విచారణ చేపట్టాలని సూచించారు. గురుకులంలో విచారణ జరిగిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురుకులంలో తనిఖీ చేసి డీసీవో వార్డెన్, ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించకుండా వెనుకొచ్చే ప్రయత్నం చేశారు.

వీడియోలు తీసింది ఎవరో త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు తప్పితే ఈ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయం ఏమాత్రం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులతో పనులు చేయించడం చాలా చిన్న విషయమని కొట్టిపారేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి చిన్నవిషయాలపై వార్తలు రాయవద్దు, సోషల్​మీడియాలో పోస్ట్​చేయవద్దని విలేకరులకు సూచించారు. డీసీవో తీరుపై విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించడం చిన్నవిషయమా సారూ అంటూ ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్​సిక్నాపట్నాయక్​దృష్టిసారించి అవినీతిపరుల ఆటకట్టించి విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలని పలువురు కోరుతున్నారు. -దిశ, వ‌రంగ‌ల్ బ్యూరో

దిశ, వ‌రంగ‌ల్ బ్యూరో : గాయం ఒకచోటయితే మందు మరోచోట రాసిన‌ట్లుగా, బాధితుల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన అధికారి అన్యాయం చేస్తున్న వారికే అండ‌గా నిలిచిన చందంగా వ్యవ‌హ‌రించిన వైనం ఐన‌వోలు బీసీ బాలురు గురుకుల పాఠ‌శాల‌లో జ‌రిగింది. సిబ్బంది కొర‌త‌ను సాకుగా చూపుతూ నెల‌లుగా విద్యార్థుల‌తో వెట్టి చాకిరీ చేయిస్తున్న తీరుపై ‘దిశ’ ప‌త్రిక సాక్ష్యాధారాలు, వీడియోలు, పాఠ‌శాల ప్రిన్సిపాల్ రాజేంద్రచారి వివ‌ర‌ణ‌తో స‌మ‌గ్రమైన క‌థనాన్ని మంగ‌ళ‌వారం ప్రచురించింది.

ఈ క‌థ‌నాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జ‌రిగింది. డీఆర్‌వో రాంరెడ్డి ఆదేశాల‌తో డీసీవో మ‌నోహార్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం హాస్టల్‌ తనిఖీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్థుల‌తో మాట్లాడిన తీరు, అధికారులు, సిబ్బంది నుంచి వివ‌రాలు సేక‌రించిన విధానం నామ్‌కే వాస్తేగా సాగినట్లు స్పష్టమ‌వుతోంది. ప‌నిభారంతో విద్యార్థుల‌ను చ‌దువుకు దూరం చేస్తున్న హాస్టల్ ప్రిన్సిపాల్‌, వైస్ ప్రిన్సిపాల్‌, వార్డెన్‌‌ను క‌నీసం విచార‌ణ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వెట్టి చాకిరీపై విచార‌ణ ప‌క్కకు..

ఐన‌వోలు బీసీ గురుకులంలో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ దిశ‌లో క‌థ‌నం రావ‌డంతో స్పందించిన ఉన్నతాధికారులు డీసీవో మ‌నోహ‌ర్ రెడ్డికి విచార‌ణ బాధ్యత‌లు అప్పగించారు. మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు, వీడియోల‌ను ఆధారంగా చేసుకుని హాస్టల్ అధికారుల వైఫ‌ల్యాల‌ను, విద్యార్థుల‌తో ప‌నిచేయిస్తున్న అధికారుల‌పై చ‌ర్యలు, హెచ్చరిక‌లు చేయాల్సిన డీసీవో వారికే మ‌ద్దతుగా నిల‌వ‌డం విస్తుగొల్పుతోంది.

విద్యార్థుల్లో కొంత‌మందినైనా వ‌న్ టు వ‌న్‌గా విచారించాల్సింది పోయి నామ్ కేవాస్తేగా అంత బాగానే ఉందిగా భోజ‌నం బాగానే పెడుతున్నారుగా అంటూ ముక్తాయింపు ప్రశ్నలు, విద్యార్థుల‌తో అధికారుల‌కు అనుకూల‌మైన స‌మాధానాలు ర‌ప్పించే ప్రశ్నల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం పలు అనుమానాలకు తావిస్తోంది. విచార‌ణ చేయాల్సిన అధికారి ఆ విష‌యంపై రాలేద‌న్న రీతిలో అధికారుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్లుగా వ్యహ‌రించ‌డం గ‌మ‌నార్హం.

వెట్టిచాకిరీ చిన్న విష‌య‌మా సారూ..

హాస్టల్‌లో విద్యార్థులు పూరీలు చేయ‌డం, చెత్తను ఎత్తివేయ‌డం, వంట చేయ‌డం వంటి ప‌నుల‌న్నీ చాలా చిన్న విష‌యాలని డీసీవో మ‌నోహ‌ర్ రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పడం విశేషం. విద్యార్థుల‌ను చ‌దువుకు దూరం చేస్తూ నెల‌లుగా, గంట‌ల కొద్దీ ప‌నులు చేయిస్తుండ‌డం ఎలా చిన్న విష‌యం అవుతుందో డీసీవో సార్‌కే తెలియాలంటూ విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప‌నిలో ప‌నిగా ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌పై వార్తలు రాయొద్దని, ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో అసలు పోస్ట్ చేయ‌వ‌ద్దంటూ కూడా రెక్వెస్ట్‌, స‌ల‌హాలివ్వడం సార్‌కే చెల్లింది. బీసీ గురుకులంలో విద్యార్థుల వెట్టి చాకిరీ అంశం ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌గా, స‌ద‌రు శాఖ హాస్టల్ అధికారులు, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు మాత్రం చాలా చిన్న విష‌యంగా చూపించే ప్రయ‌త్నం చేస్తూ ప‌ర‌స్పరం ర‌క్షించుకునే ధోర‌ణితో వ్యవ‌హ‌రిస్తున్నారు. హాస్టల్‌లో జ‌రుగుతున్న అవినీతిలో తిలాపాపం త‌లా పిడికెడు అన్నట్లుగా జిల్లా స్థాయి అధికారులు ఉట్లుగా అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

క‌లెక్టర్ మేడం దృష్టి సారించేనా..?

గురుకులంలో విద్యార్థుల వెట్టిచాకిరీపై క‌లెక్టర్ సిక్తాప‌ట్నాయ‌క్ స్పందించాల‌న్న అభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్నాయి. స్వయంగా క‌లెక్టర్ స్పందించి ఓ క‌మిటీ వేసి విచార‌ణ చేయిస్తే హాస్టల్‌లో జ‌రుగుతున్న అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విద్యావంతులు సూచిస్తున్నారు. క‌లెక్టర్ మేడం స్పందిస్తారో లేదో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed