ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

by Sridhar Babu |
ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
X

దిశ , ధర్మసాగర్ : ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని, రాష్ట్రం లో సునాయాసంగా గెలిచే ఎమ్మెల్యే సీటు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గమే అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వాఖ్యలు చేశారు. ఈనెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ధర్మసాగర్ మండల కేంద్రంలో స్థానిక నేతలతో విస్తృత సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ప్రవర్తించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం చేసే పనులు ఎవ్వరూ చూడటం లేదని అనుకోవద్దని అన్నారు.

ప్రజాక్షేత్రం లో ఉన్నప్పుడు మనల్ని అందరూ గమనిస్తారని , వేల కండ్లు చూస్తాయని తెలిపారు. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని కోరారు. కాగా ఇవి ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించినవే అని కార్యకర్తల్లో, ప్రజల్లో చర్చనీయాంశమవుతుంది. ధర్మసాగర్ మండల కేంద్రంలో కుడివైపు మండల కాంప్లెక్స్, ఎడమవైపు బీసీ కాలనీ, ముందుకు పోతే జూనియర్ కళాశాల అవన్నీ తన హయాంలోనే వచ్చాయని వాటిని చూస్తే ఇప్పుడు సంతోషం కలుగుతుందని తెలిపారు. ఘన్పూర్ నియోజకవర్గంలో అందరం కలిసి పని చేస్తే బీఆరెఎస్ విజయం నల్లేరు మీద నడకే అని పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొందితే ప్రజలే ముందుకు వచ్చి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తారని తెలిపారు. ప్రజల మన్ననలే పార్టీ కి, మనకు బలం అని అన్నారు.

Advertisement

Next Story