న‌న్నెవ‌రూ ఏం చేయ‌లేరు.. ఐఎంఎల్ డిపోలో అధికారిణి డాబులు

by Disha Web Desk 23 |
న‌న్నెవ‌రూ ఏం చేయ‌లేరు.. ఐఎంఎల్ డిపోలో అధికారిణి డాబులు
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : న‌న్నెవ‌రూ ఏం చేయ‌లేరు.. మీడియాలో వార్త‌లు వ‌చ్చినంత మాత్ర‌నా ఏమ‌వుతుంది..? ఏం జ‌రుగుతుంది..? డిపార్ట్‌మెంట్‌లో ఏంజ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు. అంద‌రూ చేసేదే నేను చేస్తున్నా. ఎంక్వయిరీ జ‌రిగితే న‌న్న‌మైనా స‌స్పెండ్ చేస్తారా..? విచార‌ణ చేసి బ‌దిలీ చేస్తారా అంటూ స‌ద‌రు అధికారిణి సిబ్బంది, తోటి ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది. గుండ్ల సింగారం ఐఎంఎల్ డిపోలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న అధికారిణి ప‌నితీరు, అక్ర‌మాలపై దిశ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. మ‌ద్యం కొర‌త ఏర్ప‌డ‌టంతో న‌చ్చిన వ్యాపారుల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తూ..త‌న దారికి రాని వ్యాపారుల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాలో కొర్రీలు చూపుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి.

రోజూవారీగా వ‌చ్చిన మ‌ద్యం రేష‌న్‌ను ముందుగా ఆర్డ‌ర్ పెట్టుకున్న వ్యాపారుల‌కు సమానంగా పంపిణీ చేయాల్సి ఉండ‌గా, అలా కాకుండా మాములుగా స‌హ‌క‌రిస్తున్న మాత్ర‌మే మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తూ మిగ‌తా వారికి మొండి చేయి చూపుతున్న‌ట్లుగా మ‌ద్యం వ్యాపారుల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డిపోలో జ‌రుగుతున్న అక్ర‌మాలు, వ‌సూళ్ల దందాపై దిశ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌నాల ద్వారా డిపోలోని ప‌రిస్థితుల‌ను బేవ‌రేజెస్ కార్పోరేష‌న్‌లోని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లింది. డిపో అధికారిణిపై మ‌ద్యం వ్యాపారుల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన కార్పోరేష‌న్ అధికారులు ఆచితూచి స్పందిస్తున్న‌ట్లు ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అధికారిణిని కాపాడేందుకు ఒక‌రిద్ద‌రు ఉన్న‌తాధికారులు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. క‌మిష‌న‌ర్ తో పాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి అధికారిణి ప‌నితీరుపై ఫిర్యాదులు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

విచిత్ర విచార‌ణ‌..!

గుండ్ల సింగారం ఐఎంఎల్ డిపోలో జ‌రుగుతున్న ప‌రిస్థితులు, అధికారిణి ప‌నితీరుపై మౌఖిక విచార‌ణ చేయాల్సిందిగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ రేంజ్ స్థాయి అధికారికి మౌఖిక ఆదేశాలు అందిన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికారి స‌మ‌క్షంలోనే సిబ్బందిని పిలిచి డిపోలో ఏం జ‌రుగుతోంది..? డ‌బ్బుల వ‌సూళ్లు నిజ‌మేనా అంటూ ప్ర‌శ్నించి విచార‌ణ‌ను మ‌మ అనిపించిన‌ట్లుగా తెలిసింది. స‌ద‌రు అధికారిణి ఆఫీసు రూంలోనే కూర్చున్న ఉన్న‌తాధికారి, కాఫీ తాగుతూనే ఒక‌రిద్ద‌రు సిబ్బందితో మాట్లాడి వెళ్లిన‌ట్లు స‌మాచారం. కేవ‌లం విచార‌ణ చేశాం... ఇక్క‌డే అంతా స‌వ్యంగానే ఉంద‌నంటూ ఉన్న‌తాధికారుల‌కు రిపోర్టులు స‌మ‌ర్పించ‌డానికి మాత్ర‌మే ఈ ఎంక్వ‌యిరీని మ‌మ అనిపించిన‌ట్లుగా మ‌ద్యం వ్యాపారుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి మ‌ద్యం బ్రాండ్‌ డిస్ట్రిబ్యూట‌ర్లు, మ‌ద్యం వ్యాపారుల నుంచి ఎంక్వ‌యిరీ చేయాల్సి ఉన్నా.. అధికారిక విచార‌ణ‌కే ఉన్న‌తాధికారుల మ‌న‌సొప్ప‌క పోవ‌డం వెనుక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎంక్వ‌యిరీ ఆదేశాలు అందిన విష‌యంపై డీసీ అంజ‌న్‌రావును దిశ వివ‌ర‌ణ కోరిన‌ప్పుడు అలాంటిందేం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

వ్యాపారుల‌ను టార్గెట్ చేసిన అధికారిణి..

గుండ్ల సింగారం ఐఎంఎల్ డిపోలో అధికారిణి అక్ర‌మాలు, వ‌సూళ్ల వ్య‌వ‌హారం, ప‌నితీరుపై దిశ‌లో వ‌రుస క‌థ‌నాలు రావ‌డంతో వ‌రంగ‌ల్ ఎక్సైజ్‌శాఖ‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముఖ్యంగా వ్యాపారుల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌దుల సంఖ్య‌లో వ్యాపారులు దిశ‌కు అధికారిణిపై స‌మాచారం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. త‌న‌పై దిశ‌లో వ‌స్తున్న క‌థ‌నాల‌కు కొంత‌మంది వ్యాపారులే కార‌ణ‌మంటూ వారిని ఆఫీస‌ర్ టార్గెట్ చేసిన‌ట్లు స‌మాచారం. లిక్క‌ర్ రేష‌న్‌లో కొత విధించేందుకు, ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యంపై గురువారం ఓ ఇద్ద‌రు వైన్ షాపు ఓన‌ర్లు దిశ‌ను ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా అధికారిణి ప‌నితీరు, త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న తీరుపై బేవ‌రేజెస్ కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్ స‌హా ఇత‌ర ఉన్న‌తాధికారులను, మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు డిపో ప‌రిధిలోని 230కి పైగా ఉన్న‌ వైన్‌పాపుల వ్యాపారులు ర‌హ‌స్యంగా సంత‌కాల సేక‌ర‌ణ మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. ఒక‌ట్రెండు రోజుల్లో అధికారిణిపై కమిషనర్ బుద్ధప్రకాష్ జ్యోతి, అదనపు కమిషనర్లు అజయ్ రావు, సంయుక్త కమిషనర్లు ఖురేషీ, శాస్త్రి, ఆర్. సురేష్ రాథోడ్‌ల‌కు ఫిర్యాదులు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. అధికారిణిపై మ‌ద్యం వ్యాపారుల తిరుగుబాటు ఏ మ‌లుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed