వరంగల్ తూర్పులో ఈసారి తప్పకుండా కాషాయ జెండా ఎగురవేస్తాం : ప్రదీప్ రావు

by Disha Web Desk 23 |   ( Updated:2023-10-13 10:13:07.0  )
వరంగల్ తూర్పులో ఈసారి తప్పకుండా కాషాయ జెండా ఎగురవేస్తాం : ప్రదీప్ రావు
X

దిశ,ఖిలా వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని డివిజన్ 38, 37 ఖిలా వరంగల్ పడమర కోటలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు ప్రజలకు కలిగిన మేలును వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. కేంద్రం తెలంగాణకు చేసిన సహాయం తో పాటు కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ వరంగల్ తూర్పులో ఈ సారి తప్పకుండా కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా వున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు తమవే అని చెప్పు కోవటం సిగ్గుచేటన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనంతో, వ్యతిరేకతతో ఉన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నగరంలో ఎటువంటి అభివృద్ది కనిపించడం లేదన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారికి అందుబాటులో లేకుండా పోయాడన్నారు. నగరంలో భారీ వర్షాలతో నగరం నీట మునిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, కరోనా విజృంభిస్తున్న సమయంలో కానీ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇవన్నీ గమనించిన ప్రజలు ఈ సారి వరంగల్ తూర్పు లో బీజేపీ ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు, యువత ఆకర్షితులవుతున్నారని చెప్పారు.

ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం స్థానిక ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత వున్నదో అర్ధమవుతున్నదన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ అసహనాన్ని తెలియజేశారన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు వంటి అనేక పథకాలు కేవలం బీఆర్ఎస్ నాయకుల అనుచరులకు మాత్రమే ఇచ్చారని , నిజమైన పేద ప్రజలకు ఏవి అందడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, కుసుమ సతీష్, వన్నాల వెంకటరమణ, ఎరుకల రఘునందన్ రెడ్డి, కనుకుంట్ల రంజిత్, ఆడెపు వెంకటేష్, పిట్టల కిరణ్,తాబేటి వెంకట్ గౌడ్, కొల్లూరు యోగానంద్, కందిమళ్ల మహేష్, ఇనుముల అరుణ్, డివిజన్ అధ్యక్షులు గోల రాజ్ కుమార్, ఎల్లావుల చంద్రమోహన్, పుప్పాల రాజేందర్, అంకాల జనార్ధన్, గొర్రె కోటి, తీగల అమర్ గౌడ్, వేల్పుల నందు తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed