- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏనుమాముల మార్కెట్‌లో హమా‘లీలలు’
దిశ, వరంగల్ టౌన్: హమాలీలు తెగబడి పోతున్నారు. ఎగబడి రైతులు తెచ్చిన సరుకు లాక్కుంటున్నారు. యథేచ్ఛగా మార్కెట్ గేటు బయటే కాంటాలు పెట్టి మారుబేరం సాగిస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, ఆసియా ఖండంలో రెండో అతిపెద్దదైన ఏనుమాముల మార్కెట్‌లో నిత్యం కొనసాగుతున్న దందా. మిర్చి యార్డులో హమాలీలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలుదారులు సరుకు పరిశీలన పేరుతో బస్తా కోస్తే చాలు హమాలీలు ఎగబడి చేతికందినంత సరుకు లాక్కుంటున్నారు. చిన్న బస్తాల్లో నింపుకుని ఏకంగా మార్కెట్ బయటే మరో కాంటా నిర్వహిస్తున్నారు. మార్కెట్‌లో ఇప్పుడు మిర్చి సీజన్ నడుస్తోంది. కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేల బస్తాలకు పైచిలుకు ఎండుమిర్చి మార్కెట్‌కు వస్తోంది. ఈ క్రమంలో హమాలీలు తీసుకునే మిర్చి రోజుకు 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుతం మార్కెట్‌లో దేశీరకం మిర్చి క్వింటాళ్‌కు ధర రూ.72 వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఒక్కరోజు హమాలీల చేతివాటంతో రూ. లక్షల్లో రైతులకు నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది.
ఎప్పటి నుంచో...
మార్కెట్‌లో సరుకు గోల్‌మాల్ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో తీసిన సరుకును యార్డులోనే మారు బేరగాళ్లకు విక్రయించినట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయంపై పత్రికల్లో పలు కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ, ఇప్పుడు హమాలీలు మరీ తెగబడి పోయినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో లాక్కున్న సరుకును ఏకంగా దర్జాగా ద్విచక్రవాహనాలు, ఆటోల్లో గేటు దాటించి, మార్కెట్ ఎదురుగానే కాంటాలు పెట్టి మరీ లావాదేవీలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇటీవల మార్కెట్ నుంచి బయటకు తరలిస్తున్న సరుకును సెక్యూరిటీ గార్డు అడ్డుకోగా హమాలీలు గొడవకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, హమాలీలు బాహాటంగానే సరుకు మార్కెట్ దాటిస్తుండడం వెనుక మార్కెట్ అధికారుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోనే విక్రయించిన సందర్భంలో విమర్శలు రావడంతో మార్కెట్ బయట అమ్ముకోవాలని అధికారులే హమాలీలకు చెప్పి ఉంటారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
హమా‘లీల’ వెనుక అసలు కథ..
అయితే, ఈ గోల్‌మాల్ వెనుక హమాలీలు కుంటి సాకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి హమాలీలకు బస్తాకు రూ.6.50 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ రోజుకు ఆరోజు మార్కెట్‌కు వచ్చిన మొత్తం బస్తాలకు వచ్చిన మొత్తం డబ్బును హమాలీలు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆ డబ్బును హమాలీలకు పెద్దగా వ్యవహరించే వ్యక్తులే కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము ఎలా జీవనం సాగించాలంటూ హమాలీలు ప్రశ్నిస్తూ రైతుల నుంచి సరుకు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. హమాలీల పెద్దలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హమాలీల గోల్‌మాల్‌కు అడ్డుచెప్పే వారే లేకుండా పోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా రైతుల సరుకుపై హమాలీలు ఎగబడి లాక్కుంటున్నట్లు తేటతెల్లమవుతోంది. ఏదిఏమైనా, అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. హమాలీల చేతివాటంపై రైతులు ప్రశ్నిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం మార్కెట్‌లో వ్యాపారులు, హమాలీలు, దడువాయిలకు మధ్య వారధిగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జిల్లా మార్కెట్ అధికారులు, కలెక్టర్ చొరవ చూపించాలని పలువురు రైతులు కోరుతున్నారు.