నిల్వప‌త్తితో చ‌ర్మ వ్యాధులు.. ప్రమాద‌క‌రంగా బీటీ ప‌త్తి

by Mahesh |
నిల్వప‌త్తితో చ‌ర్మ వ్యాధులు.. ప్రమాద‌క‌రంగా బీటీ ప‌త్తి
X

దిశ‌, బ‌య్యారం : నిల్వ ప‌త్తితో రైతు కుటుంబాల‌కు చ‌ర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. బీటీ ప‌త్తి ధూళి రేణువుల‌తో రైతులు వారి కుటుంబ స‌భ్యులు అల‌ర్జీ, శ్వాస సంబంధిత రోగాల పాల‌వుతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఇలా జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప‌త్తికి స‌రైన ధ‌ర లేక‌పోవ‌డంతో రైతులు ప‌త్తిని నిల్వ చేసి పెట్టుకుంటున్నారు. ధ‌ర రాగానే అమ్మేద్దమ‌నే ఉద్దేశంతో నెల‌లుగా నిల్వ ఉంచ‌డంతో ఇప్పుడు అదే వారికి శాపంగా మారుతోంది. ధ‌ర పెరుగుడు దేవుడెరుగు కానీ ఉన్న ఆరోగ్యం క్షీణిస్తోంద‌ని వాపోతున్నారు. చ‌ర్మ సంబంధిత వైద్యుల వ‌ద్దకు రైతులు, వారి కుటుంబ స‌భ్యులు వంద‌లాదిగా వెళ్తుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శనం.

రైతులు సాగు చేసే బిటి పత్తి విత్తనం భారత్‌లోకి 2001 అమ‌ల్లోకి వ‌చ్చింది. బీటీ అనేది బాసిల్లస్ పురం జెనిసిస్ అనే బ్యాక్టీరియా పేరు. ఈ బ్యాక్టీరియా నుంచి క్రై లాక్ అనే జన్యువును తీసుకొని, పత్తిలో ప్రవేశపెట్టారు. ఈ జన్యువు ఒక రకమైన విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది పత్తి పంటను అధికంగా ఆశించే పచ్చపురుగు (లేదా) బోల్వార్మ తెగులును నిరోధిస్తుంది. సాగులో రైతులు కృతిమ రసాయనాల వాడ‌కం మోతాదును పెంచ‌డం కూడా పంట ఉత్తత్తుల్లో దుష్పరిణామాల‌కు కార‌ణ‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ్యక్తమ‌వుతున్నాయి.

పత్తి దూళిరేణువుల‌తో అలర్జీ బాధితుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం. అల‌ర్జీ, శ్వాస సంబంధిత ఆరోగ్య స‌మ‌స్యల‌తో ఆస్పత్రుల‌కు వెళ్తున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. పత్తిలో అలర్జీ కారక ఆనవాళ్లు ఉన్నాయి. పత్తిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం, కంటికి క‌నిపించ‌ని దూళి రేణువుల‌తో శ్వాస సంబంధిత ఆరోగ్య స‌మ‌స్యలు కూడా రైతు కుటుంబాల్లో త‌లెత్తుతున్నాయి. ప‌త్తి దూళిలోని సూక్ష్మక్రిములతో దుర‌ద క‌లుగుతోంది. దీంతో చ‌ర్మం ఎర్రబార‌డం, ద‌ద్దుర్లు, మంట ల‌క్షణాలు క‌నిపిస్తున్నాయి. అలాగే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, ద‌గ్గు వంటి ల‌క్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story