MLA Revuri Prakash Reddy: మాట ఇచ్చాడు ఈరోజు నెరవేర్చాడు..: ఎమ్మెల్యే రేవూరి

by Aamani |
MLA Revuri Prakash Reddy:  మాట ఇచ్చాడు ఈరోజు నెరవేర్చాడు..: ఎమ్మెల్యే రేవూరి
X

దిశ, హనుమకొండ టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని దానికి నిదర్శనం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నిలబెట్టుకున్నారని అన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో బైక్ లతో ర్యాలీ నిర్వహించి అనంతరం రైతులతో ఏండ్ల బండ్లతో రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతీ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించాలని తెలిపారు. ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆరోగ్య శ్రీ పథకం అమలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ప్రీ, మహిళలకు రూ. 500/-లకే గ్యాస్ సిలిండర్, పేదలకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్ల పథకలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం గా నిలుస్తుందని తెలిపారు. రైతన్నలను ఆదుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయేనని, వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా రూ 2 లక్షల రుణమాఫీ నేటి నుంచి చేయబోతున్నామని అందుకు 31 వేల కోట్లు రూపాయలు రైతులకు రుణమాఫీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని అన్నారు.

ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు పూర్తి రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, కానీ అంతకంటే నెలరోజుల ముందే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి 7వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేయబోతున్నామని నేడు లక్ష నెలాఖరులోపు లక్షన్నర , ఆగస్టు 15 లోపు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, ఆత్మకూరు మాజీ ఎంపీపీ మార్క సుమలత, మాజీ జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, పర్వతగిరి రాజు, పరికరాల వాసు, రేవూరి జైపాల్ రెడ్డి, బయ్య తిరుపతి, ఖాజా, తనుగుల సందీప్, మాజీ ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story