భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి..

by Kalyani |
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి..
X

దిశ, గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పుల్లూరు, బుద్ధారం రెవెన్యూ ప్రాంతాల మీదుగా సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసిత రైతులకు తక్షణమే నష్ట పరిహారాన్ని చెల్లించాలని సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు భాగం లోకేశ్వరరావులు డిమాండ్ చేశారు. మండలంలోని బుద్ధారం ప్రాంతంలో భూ నిర్వాసిత రైతులకు నష్టపరహారాన్ని చెల్లించేంతవరకు రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు చేపట్ట వద్దని బాధిత రైతులు మంగళవారం వారి వారి పంట భూములలో ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ నిర్వాసితులకు ఎకరానికి పది లక్షల యాబై వేల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని మూడు సంవత్సరాల క్రితం హామి ఇచ్చిన అధికారులు నేటి వరకు కొద్ది మందికి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేనులలో పంటలు దెబ్బతినే విధంగా రైల్వే మూడవ లైన్ నిర్మాణ పనులు చేస్తున్నారని నష్టపరిహారం చెల్లించాలని కోరినా బాధిత గిరిజన రైతులపై సంబంధిత కాంట్రాక్టర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని అందోళన వ్యక్తం చేశారు.

మూడు నెలల కాలం వ్యవధిలో పూర్తి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన అధికారులు‌ మూడు సంవత్సరాలు అవుతున్నా నష్టపరిహారం చెల్లించకుండా రైల్వే మూడవ లైన్ పనులు అర్దరాత్రి వేళలో చేపడుతూ పంటలను నష్ట పరుస్తున్నారని అన్నారు. నష్ట పరిహారం పూర్తిగా చెల్లించాకే పంటల భూములలో నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎర్రటి ఎండలో కుటుంబాలతో కలిసి అందోళన చేపట్టారు. తక్షణమే భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో మరింత ఉదృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు భూక్య హరి, బీ లోకేశ్వరావు,

ఎస్.వెంకటేశ్వర్లు, బాధిత రైతులు వాంకుడోత్ తేజ్యా, నంద్యా, బీ రాందాస్, వీ మోహన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story