బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. నిల‌దీసిన వృద్ధురాలు

by Vinod kumar |
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. నిల‌దీసిన వృద్ధురాలు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: రూ.2వేల పింఛ‌నిస్తే ఇకేం అడుగోద్దా..? ఇస్తామ‌ని చెప్పిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లేవి..? మూడెక‌క‌రాల భూమి ఇంకెప్పుడిస్తరు అంటూ ఓ వృద్ధురాలు ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డిని సూటిగా ప్రశ్నించింది. ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ప్రశ్నించిన వృద్ధురాలిని నువ్వు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఏం ప‌థ‌కాలందిన‌య్‌.. అంటూ ఎదురు ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం. వృద్ధురాలు ఎమ్మెల్యేను ప్రశ్నించ‌డంతో రైతు వేదిక‌లో నిర‌స‌న స‌భ వేడెక్కింది. ఎమ్మెల్యేను ప్రశ్నించే స‌మ‌యంలో కొంత‌మంది బీఆర్‌ఎస్ నేత‌లు ఆమెను వారించే ప్రయ‌త్నంలో కొంత అదిరింపుల‌కు దిగినా ఆమె మాత్రం వెన‌క్కి త‌గ్గక‌పోవ‌డం గ‌మ‌నార్హం. స్థానికంగా మూడు రోజులు క‌రెంట్ లేక పిల‌గాళ్లు చ‌దువుకోవ‌డానికి ఇబ్బంది ప‌డినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఎమ్మెల్యే ఎదుట స‌మ‌స్యను ఏక‌రువు పెట్టే ప్రయ‌త్నం చేశారు.

ఈ ఆస‌క్తిక ఘ‌ట‌న హనుమకొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం న‌డికూడ మండ‌లంలోని రాయ‌ప‌ర్తి గ్రామంలోని రైతు వేదిక వ‌ద్ద బుధ‌వారం జ‌రిగింది. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పరకాల నియోజకవర్గం నడికూడా మండలంలోని రాయపర్తి గ్రామంలోని రైతువేదిక ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిర‌స‌న స‌భ‌లో ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న స‌మ‌యంలో వృద్ధురాలు లేచి ప్రశ్నించ‌డంతో స‌భ ఒక్కసారిగా వేడెక్కింది. వృద్ధురాలు, ఎమ్మెల్యేకు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాంగ్రెస్‌కు మద్దతిస్తే 3 గంటల కరెంటే : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అంత‌కు ముందు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే 3 గంటల కరెంటే ఇస్తార‌ని అన్నారు. ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడ‌ని అన్నారు. రేవంత్ రెడ్డికి వ్యవ‌సాయం గురించి ఏం తెలుసంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతుబందు సమితి అధ్యక్షులు, సభ్యులు, వ్యవసాయ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed