25 మంది ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త వాస్తవ‌మే: మంత్రి ఎర్రబెల్లి (వీడియో)

by S Gopi |   ( Updated:2023-03-24 18:00:45.0  )
25 మంది ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త వాస్తవ‌మే: మంత్రి ఎర్రబెల్లి (వీడియో)
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో బీఆర్ఎస్‌పై ప్రజ‌లు ప్రేమ‌ను పెంచుకుంటున్నార‌ని అన్నారు. ఈనెల 18న ఖ‌మ్మంలో ఐదు ల‌క్షల మందితో బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణ‌లో భాగంగా మంత్రి డోర్నక‌ల్‌లో ప‌ర్యటించారు. సోమ‌వారం న‌ర్సింహుల‌పేట మండ‌ల కేంద్రంలో బీఆర్ఎస్‌ మండ‌ల విస్తృత స్థాయి కార్యక‌ర్తల స‌మావేశం ఎంపీ క‌విత‌, ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఆధ్వర్యంలో జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి 75 నుంచి 100 సీట్లు గెలుస్తుంద‌ని జోస్యం చెప్పారు. అయితే కొంత‌మంది ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉన్న మాట వాస్తవ‌మ‌ని, 25 మంది ఎమ్మెల్యేల‌ను మారిస్తే బీఆర్ఎస్ 100 సీట్లు గెల‌వ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. తాను వ్యక్తిగ‌తంగా చేయించిన స‌ర్వేల ఆధారంగా చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. త‌న స‌ర్వేలు ఎప్పుడు త‌ప్పు కాలేద‌ని కూడా పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌లో చ‌ర్చనీయాంశంగా మంత్రి వ్యాఖ్యలు

25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉంద‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో, రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారాయి. ఖ‌మ్మంలో నిర్వహించ‌ త‌ల‌పెట్టిన భారీ బ‌హిరంగ స‌భ‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేయ‌డంతో మ‌రింత ప్రాధాన్యం ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌ని ప‌లు స‌ర్వేల్లో వెల్లడైంద‌ని, పీకే ఐ ప్యాక్ స‌ర్వేలోనూ ఇదే తేలింద‌ని బీఆర్ఎస్ పార్టీలోని కీల‌క నేత‌ల మ‌ధ్య ఆ మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన మాట వాస్తవం. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉంద‌ని, తాను చేయించిన స‌ర్వేల్లో వెల్లడైంద‌ని మంత్రి పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed