అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు : మంత్రి సీతక్క

by Sumithra |
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు : మంత్రి సీతక్క
X

దిశ, ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. అలాగే ములుగు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని, త్వరలోనే ఐటీడీఏ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మంగళవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బి.గితే లతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం ఐటీడీఏ కార్యాలయాలను ఏర్పాటు చేసిందని అన్నారు. త్వరలోనే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఆరు నెలలుగా పెండిగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, పనులు అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు వసతి గృహాలలో విద్యార్దులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. వసతి గృహాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనే వార్తలు రాకూడదని ఐటీడీఏ పాఠశాలల్లో మెరుగైన మార్పులు రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గిరిజనుల ఆరోగ్యం పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని గుత్తి కోయ ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. వరదల సమయంలో గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆసుపత్రులకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఆశ, అంగన్వాడీల సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని, గిరిజనులకు ఆరోగ్యం పై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పపువ్వు చెట్ల పెంపకం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తద్వారా గిరిజనులకు ఉపాధి లభించడంతో పాటు అడవి పచ్చదనంగా మారుతుందని ఇప్పపువ్వు, గింజల సేకరణ ద్వారా గిరిజనులకు ఉపాధి లభ్యం అవుతుంది కాబట్టి వాటి పెంపకం పై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఐటీడీఏ డీడీ పోచాం, డీఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, డాక్టర్ క్రాంతి కుమార్, ఓ రాజ్ కుమార్, జీసీసీ జనరల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, డీడబ్ల్యుఓ స్వర్ణలత లెనిన్, ఐటీడీఏ ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story