- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయం

దిశ, ములుగు ప్రతినిధి : పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థల యజమానులు తమ సీఎస్ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామమని, ఆయా కంపెనీల అధికారులు మొదటి అడుగు వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్, ఓపెన్ టెక్స్ట్ కార్పొరేట్ సంస్థ వారి నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల అధికారులు మారుమూల గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడం హర్షించదగ్గ విషయమని, జిల్లాలోని ఏడు గ్రామాలను నాలుగు నెలల క్రితం దత్తత తీసుకొని గ్రామ సభలలో ప్రజలు నిర్ణయించిన పనులను పూర్తి చేయడం చెప్పుకోదగ్గ విషయమని అన్నారు.
జగ్గన్నపేట గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులకు మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు ఆట వస్తువులను అందజేశారని, సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం, ఆర్ ఓ ఆర్ ద్వారా మంచినీటిని అందించనున్నారని అన్నారు. ఇదే తరహాలో ఎల్బీనగర్ గ్రామ ప్రజలు కోరిక మేరకు ఆటో, సైకిళ్లు, గేదెలను అందించారని వివరించారు. కార్పొరేట్ సంస్థల యజమానులు గ్రామీణ ప్రాంతాలను మరో మూడు సంవత్సరాలు దత్తత తీసుకున్న పక్షంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుండగా మరోవైపు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులు వెచ్చిస్తూ కార్యక్రమం చేపట్టడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. సీఎస్ ఆర్ నిధులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. రూ.కోటి 25 లక్షల నిధులతో 5 గ్రామాల్లో ఓపెన్ టెక్స్ట్ కార్పొరేట్ సంస్థ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని అన్నారు. అనంతరం ములుగు మండలంలోని ఇంచెంచెరువు పల్లెలో సర్వీస్ నౌ సంస్థ ద్వారా రూ. 25 లక్షల 50 వేలతో గిరిజన గ్రామ దత్తత అభివృద్ధి కార్యక్రమ పనులను మంత్రి సీతక్క, నిర్మాణ్ ఆర్గనైజేషన్, మయూర్ పట్నాల, సర్వీస్ నౌ సంస్థ ప్రతినిధులు విద్యానంద, స్నేహ లత, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావులతో కలిసి ప్రారంభించారు.