Illegal Mining: అక్రమ మైనింగ్‌పై అధికారుల మౌనం.. రూ.కోట్లలో సర్కార్ ఆదాయానికి గండి

by Shiva |
Illegal Mining: అక్రమ మైనింగ్‌పై అధికారుల మౌనం.. రూ.కోట్లలో సర్కార్ ఆదాయానికి గండి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: క‌ళ్ల ముందే అక్రమ మైనింగ్‌, ఇసుక డంప్‌లు క‌న‌బ‌డుతున్నా సీజ్ చేయాల్సింది పోయి అధికారులు చేష్టలుడిగి చూస్తుండ‌టం ఆశ్చర్యం కలిగిస్తోంది. విచార‌ణ పేరుతో రోజుల త‌ర‌బ‌డి ఉద్దేశపూర్వకంగా ఆల‌స్యం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. హ‌న్మకొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లంలోని మర్రిప‌ల్లిగూడెం గ్రామ ప‌రిధిలోని పెద్దవాగులో ఇసుక అక్రమ త‌వ్వకాలు కొన్నాళ్లుగా జ‌రుగుతున్నాయి. మ‌ర్రిపెల్లిగూడెం- న‌డికూడ మండ‌లంలోని చ‌ర్లప‌ల్లి గ్రామాల మ‌ధ్య ఉన్న చిన్నవాగు, పెద్దవాగుల‌పై రెండు వంతెన‌ల‌తో పాటు బీటీ రోడ్డు నిర్మాణ ప‌నులను ద‌క్కించుకున్న ఓ సంస్థ పెద్దవాగులో అక్రమంగా ఇసుక త‌వ్వకాలు చేప‌డుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇసుక‌ను డంప్‌లుగా చ‌ర్లప‌ల్లి గ్రామాన్ని ఆనుకుని డంప్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇసుక త‌వ్వకాలు జ‌రుగుతున్న తీరుకు సాక్ష్యంగా వీడియోల‌తో స‌హా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వాగులో ఇసుక‌, ఫిల్టర్ ఇసుక‌, మొరం త‌వ్వకాల‌కు స‌ద‌రు కాంట్రాక్ట్ సంస్థ విధ్వంస‌మే సృష్టించింది. ఆధారాల‌ను అధికారుల ముందుంచి.. వివ‌ర‌ణ‌ల‌తో ‘దిశ’ వ‌రుస‌గా క‌థ‌నాలు ప్రచురించింది. ఈ విష‌యంపై క‌మ‌లాపూర్ ఇంచార్జి త‌హ‌సీల్దార్ శోభారాణి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస‌రెడ్డిలతో పాటు ఆర్డీవో వెంక‌టేశ్వర్లు దృష్టికి సైతం తీసుకెళ్లారు.

విచార‌ణ పేరుతో జాప్యం

వాగులో ఇసుక అక్రమ త‌వ్వకాల‌పై ఆధారాల‌తో స‌హా ‘దిశ‌’ అధికారుల ముందుంచింది. అయితే, దీనిపై చ‌ర్యలు చేప‌ట్టాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం ఉద్దేశ‌పూర్వకంగా జాప్యం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అక్రమ త‌వ్వకాల‌పై క‌మ‌లాపూర్ ఇంచార్జి త‌హ‌సీల్దార్ శోభారాణిని ఎంక్వయిరీ చేయాల్సిందిగా ఆదేశించామని ‘దిశ‌’కు ఫోన్‌లో వివ‌రించారు. క్షేత్రస్థాయిలో ప‌రిశీల‌న చేశాం.. త‌వ్వకాలు జ‌రిగాయి.. డంప్‌లు కూడా ఉన్నాయ్‌ తెలిపారారు. అయితే, అక్రమ తవ్వకాలపై ఆర్డీవోకు, క‌లెక్టర్‌కు అంద‌జేస్తామంటూ ఆర్‌ఐ శ్రీనివాస‌రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. దాదాపుగా వారం దాటుతున్నా ఈ విష‌యంపై ఇప్పటికి రెవెన్యూ అధికారులు నివేదిక స‌మ‌ర్పించక‌పోవ‌డం పలు అనుమానాల‌కు తావిస్తోంది. స‌ద‌రు కాంట్రాక్టు సంస్థకు స‌మీప ప్రాంతంలోనే మ‌రో నిర్మాణ ప‌నులు కొన‌సాగిస్తోంది. పెద్దవాగు నుంచి అక్రమంగా దోపిడీ చేసి ఒడ్డున డంప్ చేసుకున్న ఇసుక‌ను త‌ర‌లింపు చేప‌డుతున్నట్లుగా గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన రోజుల త‌ర్వాత కూడా అధికారుల చ‌ర్యలు లేక‌పోవ‌డం క‌మ‌లాపూర్ మండ‌లం రెవెన్యూ శాఖ కార్యాల‌యం అధికారుల ప‌నితీరుపై విమ‌ర్శల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

కాంట్రాక్టర్‌ను కాపాడుతున్నారా..

పెద్దవాగు నుంచి వంద‌లాది టిప్పర్ల ఇసుక‌ను, మొరాన్ని త‌ర‌లించుకుపోయిన కాంట్రాక్టు సంస్థకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాసే విధంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. విచార‌ణ‌కు క్షేత్రస్థాయిలో వెళ్లిన త‌మ‌కు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులెవ‌రూ క‌నిపించ‌లేద‌ని అమాయ‌క‌పు మాట‌లు చెబుతుంటే విస్తుపోవ‌డం జ‌నాల వంత‌వుతోంది. మండ‌లంలో జ‌రుగుతున్న పెద్ద అభివృద్ధికి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు, చిరునామాల‌తో స‌హా అధికారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇలా వింత స‌మాధానాలు చెబుతున్న రెవెన్యూ అధికారులు విచార‌ణ ఏం చేస్తారు..? అందులో ఎంత నిజ‌ముందో నివేదిక‌లో పేర్కొంటారు..? అస‌లు అక్రమాల‌పై ఆఖ‌రి వ‌ర‌కైనా చ‌ర్యలుంటాయా..? అన్న అనేక సందేహాలు రాక మాన‌డం లేదు. హ‌న్మకొండ క‌లెక్టర్ ప్రావీణ్య దృష్టి సారిస్తే ఈ అక్రమాలపై చ‌ర్యలుండే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

Advertisement

Next Story

Most Viewed