- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కడియంను నేనే రమ్మన్నా..: సీఎం రేవంత్

దిశ,వరంగల్ బ్యూరో : నిజాయితీతో వ్యవహరిస్తూ, రాజకీయంగా ఎంతో అనుభవమున్న కడియం శ్రీహరి సేవలను వినియోగించుకునేందుకు తానే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన విజ్ఞానం, అనుభవం కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడ్పాటు కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి రమ్మనడం జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయనకున్న చిత్తశుద్ధిని ప్రశంసించారు.
రాజకీయంగా అనుభవజ్ఞుడని, పైరవీలకోసం రాడని..నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే వస్తాడని, నిజాయితీగా ఉంటాడని అందుకే శ్రీహరి గారంటే ఎంతో అభిమానమంటూ కొనియాడారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లిలో ఆదివారం నిర్వహించిన ప్రగతిబాట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పలుమార్లు కడియంను కొనియాడారు. ఏ నియోజకవర్గంలో ఏకకాలంలో ఇన్ని నిధులతో పనులకు శంకుస్థాపనలు జరగలేదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధికి పరితపించే కడియం నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలని, ఆయనకు మద్దతుగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని స్పష్టం చేశారు.
సభ సక్సెస్...!
ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ సక్సెస్అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న అధికారిక కార్యక్రమ సభకు జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు గత పదిరోజులుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. గతంలో ఎన్నడు, ఏ నియోజకవర్గంలో జరగని విధంగా ఏకకాలంలో రూ.800కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకు స్థాపనలు చేపట్టడంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎండలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సభా నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సుల్లో భారీగా జనం తరలివచ్చారు.