ప్రమాదంలో ప్రజారోగ్యం.. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు!

by Anjali |
ప్రమాదంలో ప్రజారోగ్యం.. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు!
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీల బండ్లతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని వైన్ షాపులే అడ్డాగా వివిధ రకాల ఆహార పదార్థాల బండ్లు ఏర్పాటు చేస్తున్నారు. గడచిన ఏడాది, రెండేళ్ల కాలంలో ఈ షాపుల ఏర్పాట్లు మూడింతలైంది. నర్సంపేట పట్టణంలోనే కాకుండా పట్టణ సమీపంలో సైతం ఫుడ్ సెంటర్లతో కూడిన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. రహదారుల వెంట కొత్తగా వెలసిన చిన్న చిన్న షాపుల్లో సైతం బీర్, బిర్యానీలతో పాటుగా చిరుతిళ్ళు లభ్యం కావడం సాధారణంగా మారిపోయింది. ఫుడ్ సెంటర్ల ఏర్పాటు వరకు బాగానే ఉన్నా దాంట్లో వండి వారుస్తున్న ఆహార పదార్థాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.

నర్సంపేట పట్టణంతో సహా నియోజక వర్గ పరిధిలోని 6 మండలాల్లోనూ నూతనంగా ఏర్పడుతున్న ఫుడ్ సెంటర్లలో 24 గంటలూ మద్యంతో పాటుగా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీటితో పాటుగా పట్టణ కేంద్రంలోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన బజ్జీల బండ్లలోనూ ఒకసారి వినియోగించిన వంట నూనెను పదే పదే వినియోగిస్తుండడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గిరాకీ కోసం ఫుడ్ సెంటర్లలో, పానీపూరి బండ్లలో రుచికి మించి హానికర రసాయనాలు వాడుతుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.

వైన్ షాపులే అడ్డాగా ఫుడ్ సెంటర్ల ఏర్పాటు..

నర్సంపేట పట్టణంలోని వైన్ షాపులు ఫుడ్ సెంటర్లకు అడ్డాగా మారిపోయాయి. టౌన్ పరిధిలోని 9 వైన్స్ షాపుల వెంట రెండు, మూడు ఫుడ్ షాపులు ఉండటం పరిపాటిగా మారింది. వైన్స్ కు మద్యం కోసం వచ్చే మద్యం ప్రియులకు నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్ సౌకర్యం మాత్రమే ఏర్పాటు చేయాలి. కానీ సిట్టింగ్ విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో స్టఫ్ కోసం మద్యం ప్రియులు ఫుడ్ సెంటర్లలో తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ధనార్జనే ధ్యేయంగా ఫాస్ట్​ఫుడ్ సెంటర్ నిర్వాహకులు అధిక మసాలాలు చేరుస్తూ రుచికి మించి రసాయనాలు కలుపుతూ ఆరోగ్యాలను దెబ్బ తీస్తున్నారు. వీటితో పాటుగా నాణ్యత లేని సరుకులతో ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. పర్మిట్ రూమ్ సౌకర్యం మాత్రమే ఉండేలా చూడాల్సిన సంబంధిత అధికార యంత్రాంగం ఉదాసీనత పాటించడం వైన్స్ షాపుల పక్కన ఫుడ్ సెంటర్ల విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.

తక్కువ ధర.. ఎక్కువ మజా..

నియోజక వర్గంలోని ఆరు మండలాల నుంచి వివిధ అవసరాల కోసం నిత్యం వందల సంఖ్యలో ప్రజలు నర్సంపేటకు వస్తుంటారు. చిన్న పిల్లలు, యువత, పెద్దలు ఎక్కువగా తక్కువ ఖరీదైన ఫుడ్ పట్ల ఆసక్తి కనబరచడం జనాల అనారోగ్య సమస్యకు ప్రధాన కారణంగా మారుతోంది. పట్టణంలో పలు టిఫిన్ సెంటర్లు, బేకరీలు, రెస్టారెంట్లు హానికరమైన రసాయనాలు ఉపయోగించి వేడివేడిగా కస్టమర్లకు అందజేస్తున్నారు.

వాడిన నూనె మళ్లీ మళ్లీ..

పట్టణంలో దాదాపు పదుల సంఖ్యలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీల బండ్లు, పానీపూరి బండ్లు ఉన్నాయి. రోజువారీగా బజ్జీలు, గారెలు, పునుగులు, చికెన్ ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్​ ఒకే వంట నూనెను వాడుతారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుండడం సాధారణంగా మారిపోయింది. రోడ్డుపక్కన, ఫాస్ట్​ఫుడ్ సెంటర్లలో తిన్న ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

అధికారుల ఉదాసీనత..

నర్సంపేట పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫుడ్ సెంటర్లపై సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతుండటంతో ఫుడ్ సెంటర్ల సంఖ్య రెండింతలైనట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed