వరంగల్‌ బల్దియాలో భలే ఆఫర్‌.. భర్తకు అనారోగ్యమని భార్యకు కొలువు

by Mahesh |
వరంగల్‌ బల్దియాలో భలే ఆఫర్‌.. భర్తకు అనారోగ్యమని భార్యకు కొలువు
X

దిశ, వరంగల్‌ టౌన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాల్లోనే అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాంట్రాక్ట్‌ పద్ధతిపై చేపట్టిన నియామకాల్లో అక్రమాలపై పోలీసు కేసు కూడా నమోదైంది. విచారణ చేపట్టి ఒకరిని అరెస్ట్‌ చేసిన సంగతి విధితమే. ఆ వివాదమే ఎప్పుడు కొలిక్కివస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే పర్మినెంట్‌ ఉద్యోగుల విషయంలోనూ లొసుగులు చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. భర్త చాటున భార్యలు కొలువులు వెలగబెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు డిప్యూటీ స్థాయి అధికారి ఒకరు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో ఉద్యోగానికి కుదురుకున్నాడు. కొంతకాలం పని చేసిన తర్వాత అతడు అనారోగ్యం పాలయ్యాడని దానికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టులు బల్దియాకు సమర్పించి ఆ కొలువును తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. అప్పటి కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ అతడి పరిస్థితికి, ఆవేదనకు చలించిపోయినట్టున్నారు. అతని స్థానంలో అతని భార్యకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో ఇలాంటిది సాధ్యమవుతుందా? అనే విషయంపై పలువురు సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు.

భర్త పేరిట ఉన్న ఉద్యోగంలో ఇప్పటికీ ఆమె పని చేస్తూ భర్త పేరిటే జీతభత్యాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాజీపేట ‘జోన’ల్‌ పరిధిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆమెకు ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయంపై ఎవరూ ప్రశ్నించలేకపోతున్నట్లు బల్దియాలో చర్చించుకుంటున్నారు. ఇలా ఆమె ఒక్కరే కాదు, చాలామంది అధికారిక ఉత్తర్వులు లేకుండానే వరంగల్‌ మహానగర పాలక సంస్థలో నౌకర్లు వెలగబెడుతున్నట్లు పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా.. బల్దియా ఉన్నతాధికారులు ఒక్కరు కూడా పసిగట్టలేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.ఈ విషయమై జీడబ్ల్యూఎంసీ అధికారులు ఎలా స్పందిస్తారో, ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed