బీజేపీని ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛ

by Disha Web Desk 15 |
బీజేపీని ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛ
X

దిశ, హనుమకొండ టౌన్ : బీజేపీని ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛ అని, దేశ భవిష్యత్తుకు 2024 పార్లమెంట్ ఎన్నికలు కీలకం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం హన్మకొండ కనకదుర్గ కాలనీలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ...పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అన్నారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేని బీజేపీ, మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని తహతహలాడు తుంది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళ సూత్రానికి భద్రత ఉండదనే విధంగా ప్రధాని మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు అని, కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌ మేనిఫెస్టోగా పేర్కొంటున్నారు అన్నారు. కానీ మా మేనిఫెస్టో పంచ న్యాయ్ ద్వారా అణగారిన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడుతుంది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పరోక్షంగా ఎత్తివేసే కుట్ర చేస్తోంది అన్నారు. బీజేపీ కుట్రల పట్ల భారత దేశ ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తమవ్వాలని కోరారు.

బీజేపీ పాలనలో దళితులపై, ముస్లింలపై, క్రైస్తవుల పై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ఈ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకోవాలి అని తెలిపారు. మోదీ పేద వర్గాలపై పగతో బడుగు వర్గాలపై కక్షతో దేశ సంపదను అధాని, అంబానీలకు దోచిపెడుతున్నారు అని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం కాబట్టే విభజన హామీలను అమలు చేయడం లేదు అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదు అన్నారు. పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండు లక్షల చొప్పున రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారు అని అన్నారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనం తెచ్చి జన్‌ ధన్‌ ఖాతాల్లో ప్రజలకు 15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన మోదీ కనీసం 15 రూపాయలు కూడా జమ చేయలేదు అని, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఒరగ బెట్టింది ఏమీ లేదు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అని అన్నారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 7 నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికను మీ ముందు పెట్ట బోతుంది అన్నారు. కాళేశ్వరం బ్యారేజీలో పిల్లర్లు కుంగి పోవడానికి కేసీఆరే బాధ్యత వహించాలి అన్నారు. అక్కడ కుర్చీ వేసుకొని నీళ్లు వదిలితే కుర్చీ తో పాటు ఆయన కూడా కొట్టుకు పోతారు అని, ఫోన్ ట్యాపింగ్ కామన్ అన్న కేసీఆర్ అధికారులను బలి చేశారు అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఇరికించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నారని తెలిపారు. నా బిడ్డ ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే మంద కృష్ణ నా ఇంటికి వచ్చి దండం పెడతాడు అని, నా వద్ద వందల కోట్లు ఉన్నది నిజమైతే , నాపై ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు ఎందుకు చేయడం లేదు అన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, తెలంగాణ అంటేనే విప్లవాల పురిటి గడ్డ, వామ పక్ష భావజాలాలు కలిగిన గడ్డ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉంది అన్నారు. బీజేపీ దుర్మార్గపు రాజకీయ లను అడ్డుకోవడం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం అని, మే 13 న కాంగ్రెస్కు ఓటు వేసి బీజేపీకి బుద్ది చెప్పాలి అన్నారు.



Next Story

Most Viewed