నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తికాని బ్రిడ్జి నిర్మాణం..

by Aamani |
నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తికాని బ్రిడ్జి నిర్మాణం..
X

దిశ,కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి సులువుగా చేరేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్ల నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏజెన్సీ గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్లే దారిలో గల ఓ బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నెలలు గడుస్తున్నా పూర్తవడం లేదు. ఈ నేపథ్యంలో వర్షాకాలం మొదలవడంతో ఏజెన్సీ వాసుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు సైతం కురుస్తున్న వర్షాలకు ఇరుపక్కలా కొద్దికొద్దిగా క్రుంగతుండటంతో రాకపోకలు తగ్గిపోతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డుపై ప్రజలు వెళ్లాలంటే జంకుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి పొగుల్లపల్లి వెళ్లే వైపుగా గల లోతట్టు గ్రామాలను కలుపుతూ బ్రిడ్జిని ఎమ్మెల్యేగా గెలుపొందిన దనసరి అనసూయ ( సీతక్క ) మంజూరు చేయించింది.

మంత్రి అయ్యాక కొత్తగూడ ఉమ్మడి మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సీతక్క పలు అభివృద్ధి పనులు మొదటి నుంచి చేపడుతూ వస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయనే ఉద్దేశ్యంతో దాదాపు రూ. రెండు కోట్లు కేటాయించి మంజూరు చేయించారు. కాగా టెండర్ దక్కించుకున్న గుత్తేదారు నిర్మాణ పనులు ప్రారంభించి పిల్లర్లు వరకు పనులు చేశారు. రోడ్డుకు సమాంతరంగా స్లాబ్ వేయకుండానే వదిలి వేశాడు. దీంతో బ్రిడ్జి పూర్తి కాలేదు. తాత్కాలికంగా పక్కదారి వేశారు. ఇది కాస్త ప్రమాదంగా ఉండటంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు విపరీతంగా కురుసే అవకాశం ఉన్నందున లోతట్టు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తనుంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు సమస్యను అర్థం చేసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : వాసం సారయ్య, సాది రెడ్డి పల్లి గ్రామస్తులు

ఏజెన్సీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం నుండి లోపలి గ్రామాలు అయిన కొత్తపల్లి వైపు నుండి దాదాపు ఇరవై గ్రామాలు ఉన్నాయి. ఇరవై గ్రామాల ప్రజల కోడి కూత నుండి పనుల నిమిత్తం కొత్తగూడకు రావలసి ఉంటుంది. మండల కేంద్రములో పనులు పూర్తి చేసుకొని పట్టణాల్లో పనులు చూసుకోవడానికి పట్టణాలు అయిన నర్సంపేట, జిల్లా అయిన మహబూబాబాద్ , వరంగల్ వెళ్తుంటారు. పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లాలంటే ఆలస్యం అయ్యిందంటే చీకటి పడుతుంది చీకటిలో భయం భయంగా సాహసంతో గూటికి చేరుకోవలదిందే చీకటి సమయాల్లో ఆర్టీసీ బస్సులకు ఆశ్రయిస్తారు. తాత్కాలిక రోడ్డు ప్రమాదకరంగా ఉండటం వల్ల వాహనాలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు వెళ్లే విధంగా రోడ్డు లేకపోవడంతో మరే దారి లేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు నిలిపివేయడంతో గమ్యం చేరుకోలేక మధ్యలోనే ఓవైపు ఆకలి మరో వైపు చీకటి దోమలు బిక్కు బిక్కు మంటూ నడుచుకుంటూ మరీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్షనమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రమాదాల బారి నుండి రక్షించాలి.

త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం : యశ్వంత్ పంచాయతీరాజ్, ఏఈ

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేసేందుకే కృషి చేస్తున్నాము. కొత్తపల్లి, పొగుల్లపల్లి గ్రామం మధ్యలో ఉన్న బ్రిడ్జి ప్రభుత్వ ఆదేశాల మేరకే పనులు నడుస్తున్నాయి. టెండరు దశలు వారీగా నడుస్తుంది. ప్రస్తుత టెండరు ప్రకారం పనులు పూర్తి అయ్యాయి. మళ్ళీ టెండరు రాగానే పనులు ప్రారంభిస్తాం. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తాము.

Advertisement

Next Story

Most Viewed