- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dornakal: వృక్ష విలాపం.. అనుమతి జానెడు.. అక్రమం బారెడు!

దిశ, డోర్నకల్: అడవుల రక్షణకు ప్రభుత్వం పనిచేస్తుంటే అక్రమార్కులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా కలప తరలిస్తున్నారు. అధికారుల కంటపడకుండా ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లు నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అడవిని రక్షించడంతోపాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టా రూపొందించింది. చెట్లను నరికి వేయాలంటే అటవీశాఖ, రెవెన్యూశాఖ, సంబంధిత గ్రామపంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అధికారుల అలసత్వం దళారులకు వరంగా మారింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, సీరోల్ మండలాల పరిధిలోని మన్నెగూడెం, అందనాలపాడు, చిలుక్కోయాలపాడు, కాంపెళ్లి, నల్లెల్ల, ములకలపల్లి, తోడేళ్లగూడెం, గొల్లచర్ల, హుణ్యతండా, బూరుగుపాడు, రాము తండాతో పాటు పలు పల్లెల్లో కలప అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి గుట్టల్లో ఏపుగా పెరిగిన చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాసులు కురిపిస్తున్న కలప దందా..
వేప, తుమ్మ, నర్లింగ, చింత చెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదు. పంటచేలు, గుట్టల ప్రాంతంలోని చెట్లు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన వృక్షాలను నేలకూలుస్తున్నారు. కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని వాహనాల్లో ఖమ్మం నగరానికి తరలిస్తూ టన్నుల చొప్పున విక్రయిస్తున్నారు. చెట్ల నరికివేతపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
చెట్ల నరికివేతపై పర్యవేక్షణ ఏది?
కలప అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారుల కనుసన్నలోనే జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున చెట్లను నరికి రాత్రుళ్లు పట్టణానికి, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అనుమతి జానెడు.. నరికేది బారేడు.. అన్న చందంగా అక్రమ నరికివేత జరుగుతోంది.వాల్టా అనుమతి కోరిన సర్వే నెంబర్, ఎన్ని చెట్లు, ఏ రకం అనేది సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతివ్వాలి. అధికారుల పరిశీలన జరుగుతుందో లేదో వారికే తెలవాలి. అక్రమార్కులు ఒక్క అనుమతిపై రెట్టింపు చెట్లు నరికి తరలిస్తున్నారు. సహజ సంపదను కాపాడాల్సిన అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం..
మా డిపార్ట్మెంట్కు అర్జీ పెట్టుకున్న వివరాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇస్తున్నాం. నిరంతరం నిఘా పెడుతున్నాం. ఇటుక బట్టీల యజమానులు అనుమతి లేని కలపను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలియజేశారు.