'ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ప్రతిరోజూ అందుబాటులో ఉండాలి'

by Sumithra |
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ప్రతిరోజూ అందుబాటులో ఉండాలి
X

దిశ, జనగామ : జిల్లాలోని జాఫర్గఢ్ మండలంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, ధరణి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల నమోదు ప్రక్రియను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ధరణి దరఖాస్తుల నమోదులో ఎటువంటి అలసత్వం వహించరాదని, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా, ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.

ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుల స్కానింగ్, తదితర ఆధారిత డాక్యుమెంట్ ల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ కింద ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియను పర్యవేక్షించారు. 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందికి సంబందించిన రిజిస్టర్ లను తనిఖీ చేసి, విధులకు రాని వైద్యులపై చర్యలు చేపట్టి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కేజీబీవీ పాఠశాల, హాస్టల్ ని సందర్శించి, పరిశీలించారు.

ఈ సందర్భంగా వంట గదిని తనిఖీ చేసి, తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. అలాగే బియ్యం, కూరగాయలు, గుడ్లు, పప్పులు, ఉల్లిగడ్డల నిల్వలను పర్యవేక్షించి, సరైన విధంగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించి, చేపట్టిన మౌలిక వసతులను (టాయిలెట్స్, తాగునీరు) పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అదే విధంగా విద్యార్థులకు యూనిఫాం లను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న, డీఈఓ రాము, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఆర్ఐ అనిల్, ఎంపీడీఓ సుమన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

Next Story