ఛత్తీస్‌ఘడ్ టు చల్లగరిగ.. సుధాకర్ దంపతులకు ఇక సెలవు..

by Disha Web Desk 23 |
ఛత్తీస్‌ఘడ్ టు చల్లగరిగ.. సుధాకర్ దంపతులకు ఇక సెలవు..
X

దిశ,చిట్యాల :ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా సమీప అటవీ ప్రాంతంలో ఈనెల 16న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చల్లగారిగా గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత ఉత్తర బస్తర్ డివిజన్ మాస్ ఇన్ చార్జి డీవీసీ సభ్యు డు సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ రావు, అలియాస్ మురళి అతని భార్య ఉత్తర బస్తర్ డివిజన్ సభ్యురాలు సుమన అలియాస్ రజితలు మృతి చెందారు. 16వ తేదిన జరిగిన ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన మావోయిస్టు నేతల మృతదేహాలకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి మృతుల కుటుంబ సభ్యులు వెళ్లి కనుగొన్నారు. పోస్టుమార్టం అనంతరం నేతల మృతదేహాలను సుధాకర్ స్వగ్రామమైన చల్లగరిగకు తీసుకువచ్చారు. మృతదేహాలను సందర్శనార్థం అతని ఇంటి ముందు ఉంచారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై మావోయిస్టు నేతల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విషణ్ణ వదనాలు వ్యక్తం చేశారు.

అమరుల బంధువులు, సంఘం నాయకులు, హౌరా హక్కుల సంఘం నాయకులు, విరసం నేతలు, ప్రజా ఫ్రంట్ నాయకులు, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు, సామాజిక ఉద్యమ నాయకులు, బాధ్యులు పెద్ద సంఖ్యలో హాజరై మృతదేహాలపై ఎర్ర జెండాలను కప్పి నివాళులు అర్పించారు. అనంతరం మావోయిస్టు నేతలను స్మరిస్తూ విప్లవ సాహిత్యాలను ఆలపించారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గ్రామానికి చెందిన పాస్టర్ మృతుడు సుధాకర్ తల్లి రాజ పోషమ్మతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. గ్రామ రెండు కూడళ్ల మధ్య నుండి సాగిన అంతిమయాత్రలో గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మావోయిస్టు నేతలకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

అనంతరం ముచ్నిపర్తి శివారులో రెండు మృతదేహాలను ఖననం చేశారు. మావోయిస్టు నేతల అంత్యక్రియల సందర్భంగా పోలీసు బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టిన ట్లు సమాచారం. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మధన కుమారస్వామి, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంతక్క, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శోభ, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులు బాలసాని రాజయ్య, ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాది సుదర్శన్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజన్న, సామాజిక ఉద్యమ నాయకుడు హుస్సేన్, సంబంధిత శాఖల బాధ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, విరసం నాయకుడు రవి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed