జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతుంటే మోదీకి వ‌ణుకుపుడుతోంది: ఆరూరి రమేష్

by S Gopi |   ( Updated:2022-12-23 15:06:03.0  )
జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతుంటే మోదీకి వ‌ణుకుపుడుతోంది: ఆరూరి రమేష్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో /ములుగు ప్రతినిధి/ జ‌న‌గామ‌/ మ‌హ‌బూబాబాద్ టౌన్ : తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వంపై కేంద్రం క‌క్ష, వివ‌క్షల‌ను ప్రద‌ర్శిస్తోంద‌ని బీఆర్ఎస్ కీల‌క నేత‌లు ధ్వజ‌మెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే కేంద్రం కుళ్లుకుంటోంద‌ని పేర్కొన్నారు. దేశానికే మోడ‌ల్ రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ భార‌త్‌ రాష్ట్ర స‌మితిని స్థాపించి జాతీయ రాజ‌కీయాల్లోకి ప్రవేశించ‌డంతో మోదీలో వ‌ణుకుపుడుతోంద‌ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. ముఖ్యమంత్రి చ‌రిష్మాను, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం స‌హాయ‌నిరాక‌ర‌ణ చేయ‌డంతోపాటు అనేక కుట్రలు, కుతంత్రాల‌కు తెర‌లేపుతోంద‌ని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద రైతులు వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయ‌డం దుర్మార్గపు చర్యగా అభివ‌ర్ణించారు. కేంద్ర ప్రభుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, ములుగు, మ‌హ‌బూబాబాద్‌, జ‌న‌గామ‌, జ‌య‌శంక‌ర్‌ భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రాల్లో రైతు మ‌హాధ‌ర్నా నిర‌స‌న కార్యక్రమాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్నాలో బీఆర్ఎస్ నేత‌లు బీజేపీపై ఫైర‌య్యారు.

రైతుల న‌డ్డివిరిచేస్తోన్న కేంద్రం: ఎమ్మెల్యే ఆరూరి

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహారిస్తోందని వ‌రంగ‌ల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడం కేంద్ర దుర్మార్గపు చర్యల‌కు నిద‌ర్శన‌మ‌ని అన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో వరంగల్ ఓ సిటీ మైదానంలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ పనులకు అనుసంధానం చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. పైగా ఇప్పుడు మొత్తం పథకాన్నే నీరుగార్చే విధంగా అనేక షరతులు, కోతలను కొత్తగా చేర్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయాలని అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని అహర్నిశలు కృషి చేస్తుంటే, కేంద్రం మాత్రం కార్పొరేట్ కంపెనీలతో కలిసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను అమలులోకి తీసుకువస్తోంద‌ని అన్నారు. రైతుల పక్షపాతిగా ఉంటున్న బీఆర్‌ఎస్‌కు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తూ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా సాగుకు అవసరమైన నీటి వనరుల పెంపుతో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలు పండిస్తూ పురోగతి సాధిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఏదో విధంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. వరి వేయవద్దు అంటూ మెలికలు పెట్టి సాగు తగ్గించే కుట్రలు పన్నిన కేంద్రం తాజాగా, ఉపాధిహామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న కల్లాలపై కత్తి కట్టిందని, ఈ కల్లాల బిల్లులు వాపసు ఇవ్వాలని దుష్ప్రచారానికి దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా పరిధిలోని రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్లు త‌ర‌లివ‌చ్చారు.

తెలంగాణ రైతుల కల్లాలపై కేంద్రానికి ఎందుకింత కుళ్లు: చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్

రైతు వ్యతిరేక విధానాలతో కేంద్రప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోంద‌ని ఎమ్మెల్యే విన‌య్‌భాస్కర్ మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతు కల్లాలపై కుట్రలు చేస్తూ నిధులు వెనక్కి చెల్లించాలని కేంద్రం హుకుం జారీ చేయ‌డం అహంకార పూరిత వైఖ‌రిని స్పష్టం చేస్తోంద‌ని అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తూర్పరాబట్టారు. రాష్ట్రంపై పలు కక్ష్య సాధింపు విధానాలను అవలంభిస్తున్న కేంద్ర మొండి వైఖరిని మార్చుకోకపోతే రైతుల ఆగ్రహ జ్వాలాల్లో కొట్టుకుపోతారని ఆయన హితబోధ చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంపై విద్వేషాన్ని వ్యక్తపరుస్తూ తన బట్టేబాజ్ విధానాన్ని తెలియపరుస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వొడితల సతీష్ కుమార్, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఆగ్రోస్ మాజీ చైర్మన్ కిషన్ రావు, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


కేంద్రం వైఖ‌రి సిగ్గుచేటు : మాజీ మంత్రి బస్వరాజు సారయ్య

రైతులు పంటపొలాల్లో కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపమనడం సిగ్గుచేటని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రైతు మహాధర్న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ, తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ర్టాల్లో కూడా ఉపాధీ హామీ పథకంలో భాగంగా కల్లాల‌ నిర్మాణం జరుగుతోంద‌ని గుర్తుచేశారు. అక్కడ నిధులు వెన‌క్కివ్వాలని అడ‌గ‌ని కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం టార్గెట్ చేసింద‌ని అన్నారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ వరి కల్లాల‌పై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు.

కుట్రల‌ను తిప్పికొట్టాలె: ఎమ్మెల్సీ పోచంప‌ల్లి

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జనగామ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ,ఇతర పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకాగా ఆయన ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న రైతు పథకాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. అంతకు ముందుగా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డిలు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తుంటే బీజేపీ ఓర్వలేక బీఆర్ఎస్ ను అప్రతిష్టపాలు చేసేందుకు పూనుకుందని దుయ్యపట్టారు.

సీఎంకున్న ప్రజాద‌ర‌ణ‌ను చూడ‌లేకే కుట్రలు: ఎమ్మెల్యే గండ్ర

బీఆర్ఎస్ కిసాన్ నినాదం ఎత్తుకోవ‌డంతో మోదీ ప్రభుత్వానికి వ‌ణుకుపుడుతోంద‌ని గండ్ర ర‌మ‌ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కున్న ప్రజాద‌ర‌ణ‌ను చూసి ఓర్వలేకే కుట్రలు ప‌న్నుతోంద‌ని కేంద్రంపై ధ్వజ‌మెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి మానుకోవాల‌ని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో జ‌రిగిన రైతు మ‌హాధర్నాకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహ‌నం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీంద్రరావు స‌హా జిల్లా ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

మ‌హ‌బూబాబాద్‌లో..

మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రం నెహ్రూ సెంటర్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ మార్నేని వెంకన్న, ఊకంటి యాకూబ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, టౌన్ అధ్యక్షుడు గద్దె రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు యాకుబ్ పాషా, వెంకట్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story