ఇంజక్షన్ సరిగా వేయకపోవడంతో నడవలేక పోతున్న బాలుడు..

by Kalyani |
ఇంజక్షన్ సరిగా వేయకపోవడంతో నడవలేక పోతున్న బాలుడు..
X

దిశ, ఏటూరు నాగారం: ఓ బాలుడికి జ్వరం వ‌చ్చింద‌ని ప్రైవేట్ ఆసుప‌త్రి ఆర్ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లితే కంపౌండర్ సరిగా ఇంజక్షన్ వేయకపోవడంతో బాలుడి కాలు ప‌ని చేయ‌కుండా పోయిన ఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడు మండ‌లం ధ‌ర్మారం గ్రామంలో జ‌రిగింది. బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ధ‌ర్మారం గ్రామానికి చెందిన బోగ‌ట జ‌నార్దన్ వృత్తి రీత్యా వ్యవ‌సాయం చేసుకుంటూ జీవ‌నం గ‌డుపుతున్నాడు. కాగా 12 డిసెంబర్ 2022 న త‌న కూమారుడు బోగ‌ట ప్రవీణ్ ‌ (2సం. 4నెలలు)కు జ్వరం రావ‌డంతో అదే గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ‌నివాస క్లినిక్ లో ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం కోసం తీసుకెళ్లాడు.

కాగా ఆ స‌మ‌యంలో ఆర్ఎంపీ డాక్టర్ అయిన స‌డ్డన‌పు న‌ర్సింహ‌చారి అందుబాటులో లేక పోవ‌డంతో అత‌ని అల్లుడు శంక‌ర్ అనే వ్యక్తి జ్వరం వ‌చ్చిన ప్రవీణ్ కాలుకు ఇంజక్షన్ ఇచ్చి, సిరాప్‌లు రాసి పంపించాడు. కాగా మ‌రుస‌టి రోజు నుంచి ప్రవీణ్ న‌డ‌వ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నాడు. ఇది గ‌మ‌నించిన తండ్రి జ‌నార్దన్, కొడుకు ప్రవీణ్ ను వ‌రంగ‌ల్ లోని ఎంజీఎం ఆసుప‌త్రికి తీసుకెళ్లి చూయించగా వైద్య ప‌రీక్షలు చేసిన వైద్యులు ఇంజక్షన్ స‌రిగా వేయక‌పోవ‌డం వల్లనే ఇలా జ‌రిగిన‌ట్లు డాక్టర్లు నిర్దారించారని తండ్రి జ‌నార్దన్ విలేక‌రుల ఎదుట తెలిపాడు. కాగా ఈ విష‌యంపై శ్రీ శ్రీ‌నివాస క్లినిక్‌ ఆర్ఎంపీ డాక్టర్ న‌ర్సింహ‌చారిని సంప్రదిస్తే ‘నాకు సంబంధం లేద‌ని నువ్వు నా పేషంట్ వే కాద‌ని, మా అల్లుడు కూడా నీకు వైద్యం చేయ‌లేదు’ అని బుకాయించాడని జ‌నార్దన్ తెలిపాడు.

ఇదేంటని జ‌నార్దన్ ఆర్ఎంపీ డాక్టర్ న‌ర్సింహ‌చారితో గ‌ట్టిగా వారించాడు. దీంతో ఆర్ఎంపీ త‌ప్పు ఒప్పుకొని ఫిజియోథెర‌పి చేయిస్తే న‌యం అవుతుంద‌ని చెప్పి ఏటూరునాగారంలో పిజియోథెరపీ వైద్యం కోసం 15 రోజులు వ‌ర‌కు డ‌బ్బులు అందించాడ‌ని అప్పటికీ న‌యం కాక‌పోవ‌డంతో నా వ‌ల్ల కాద‌ని ఇక నేను వైద్యం చేయించలేనని, ఇంజక్షన్ వ‌ల్లనే ఇన్‌ఫెక్షన్ అయిందని ఏ డాక్టర్ నీకు చెప్పాడని, నీకు దిక్కున్నా చోట చెప్పుకో అని ఆర్ఎంపీ బెదిరింపు చ‌ర్యల‌కు పాల్పడుతున్నాడ‌ని తండ్రి జ‌నార్దన్ విలేక‌రుల ఎదుట ఆరోపించాడు. త‌న‌కు జ‌రిగిన అన్యాయం ప‌ట్ల న్యాయం చేయాలని బాధితుడు కోరుకుంటున్నాడు.

Advertisement

Next Story