వరంగల్ నేతకే టీడీపీ అధ్యక్ష పదవి?

by Mahesh |
వరంగల్ నేతకే టీడీపీ అధ్యక్ష పదవి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ప్రకటన మళ్లీ వాయిదా పడింది.పార్టీ నేతలంతా ఎవరోఒకరికి బాధ్యతలు అప్పగిస్తారని ఆశించారు.కానీ, త్వరలోనే మళ్లీ భవన్‌కు వస్తానని, సమయం ఇస్తానని చంద్రబాబు పేర్కొనడంతో నేతలంతా నిరసించిపోయారు.అయితే, ఈసారి వరంగల్‌కు చెందిన ఓ నేతకు అధ్యక్ష పదవి దక్కుతుందంటూ లీకులు రావడంతో ఆ నేత ఎవరా? అని చర్చ జరుగుతోంది.రేసులో మహిళా నేతలు సైతం పోటీలో ఉన్నారు.

8 నెలలుగా పోస్టు ఖాళీ..

టీ టీడీపీకి అధ్యక్షుడు లేక 8 నెలలు గడించింది.కాసాని జ్ఞానేశ్వర్ గతేడాది అక్టోబర్ 30న తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.అప్పుడు ఏపీలో పరిస్థితులు బాలేక చంద్రబాబు తెలంగాణలోని పార్టీపై ఫోకస్ చేయలేదు. ఇప్పుడు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది.దీంతో అధ్యక్షుడి నియామకంపై బాబు ఫోకస్ పెట్టారు. అయితే, ఎవరికి చాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.ఆదివారం భవన్‌కు వచ్చిన చంద్రబాబు కేవలం పార్టీ కేడర్‌ను ఉద్దేశించి మాట్లాడారు.కీలక నేతలతో భేటీ అయి అధ్యక్ష పదవిపై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే మళ్లీ వస్తానని చెప్పారంతే.

యువనేతకే బాధ్యతలు..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పగ్గాలను యువనేతకే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. యువతను ప్రోత్సహిత్సామని, పార్టీని రా స్ట్రక్చర్ చేస్తామని బాబు ప్రకటించారు. పార్టీకి వేయబోయే ఫౌండేషన్‌ రాబోయే 30 ఏళ్లవరకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించేలా ఉంటుందన్నారు. యువ రక్తానికే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో అతనెవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు సీనియర్ నేతలు, మహిళలు సైతం అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు.

వరంగల్ నేతకే పట్టం..

వరంగల్‌కు చెందిన టీడీపీ నాయకుడు, వ్యాపార వేత్తకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సదరు నేత ఏపీ టీడీపీ ఎంపీ,కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు దగ్గర అని, ఆయన అనుచరుడు అని సమాచారం. పార్టీ సైతం ఆ మేరకు లీకులు ఇస్తోంది.మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్‌కు పార్టీ చీఫ్‌ బాధ్యతలు ఇవ్వడం దాదాపు ఖరారైందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ,తుది నిర్ణయం వచ్చాకే దీనిపై క్లారిటీ రానుంది.ఇక పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ సేవలు చేస్తున్నవారికి నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెరపైకి మహిళా ప్రాధాన్యత అంశం..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పార్టీ అధ్యక్షురాలిగా మహిళకు ఛాన్స్ రాలేదు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీలు ప్రకటిస్తున్నా ఆచరణలో సాధ్యం పడటం లేదు.స్థానిక సంస్థల కోటాలో 42 శాతం ఇస్తున్నారు.అయితే, పార్టీ కమిటీల్లో సైతం ప్రాధాన్యత ఇస్తున్నా తెలంగాణలో మాత్రం ఏ రాజకీయ పార్టీ అయినా మహిళలకు అధ్యక్ష పదవిని కట్టబెట్టలేదు. ఈ క్రమంలోనే ప్రసూన, షకీలా రెడ్డితో పాటు మరికొందరు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story