న్యాయవాదిని పెట్టుకుని కొట్లాడాలి.. సీఎం రేవంత్ రెడ్డికి వినోద్ కుమార్ సూచన

by Rajesh |
Vinod kumar
X

దిశ, వెబ్‌డెస్క్: రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌తో కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ తరహాలో మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి సైనిక్ స్కూల్‌పై అబద్దాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. సైనిక్ స్కూల్‌పై కేసీఆర్ పట్టించుకోలేదు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కార్యాలయంలో కేసీఆర్ కేంద్రానికి రాసిన ఉత్తరాలు ఉంటాయని .. వాటిని రేవంత్ ఓ సారి చూడాలని సూచించారు.

వరంగల్‌లో సైనిక్ స్కూల్ అప్పుడే మంజూరు చేశారని తెలిపారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్‌ను సైనిక్ స్కూల్ గురించి అనేక సార్లూ కలిశామని గుర్తు చేశారు. దివంగత అరుణ్ జైట్లీని కూడా బీ‌ఆర్‌ఎస్ ఎంపీలుగా చాలా సార్లు కలిశామన్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్‌లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయని తెలిపారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధం అన్నారు. అబద్ధాలు మాట్లాడి మాట్లాడి రేవంత్ అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదని సెటైర్లు వేశారు.

నిరుద్యోగ సమస్యపై రేవంత్ అబద్ధాలు మాట్లాడి యువతను రెచ్చగొట్టారన్నారు. ఇకపై రేవంత్ అబద్ధాలకు ధీటుగా బదులిస్తామన్నారు. రక్షణ శాఖ భూములపై కూడా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డికి సమయం ఉంటే అప్పటి డిఫెన్స్ అధికారి జెఆర్కే రావు తో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో నిజాయితీతో కోట్లాడింది బీఆర్‌ఎస్ అని.. ఇక ముందు కూడా కొట్లాడుతామన్నారు. నీట్‌తో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై రేవంత్ దృష్టి సారించాలన్నారు. నీట్‌పై సుప్రీం కోర్టులో మంచి న్యాయవాదిని రాష్ట్రం తరపున నియమించి కొట్లాడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed