- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెడిసికొట్టిన మంత్రి అత్యుత్సాహం.. శ్రీనివాసగౌడ్‌కు మరో బిగ్ షాక్!
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి శ్రీనివాసగౌడ్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు బట్టబయలైంది. మంత్రిగా చూపిన అత్యుత్సాహం బెడిసికొట్టింది. గత నెల 13న మహబూబ్‌నగర్ టౌన్‌లో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా పోలీసు గార్డు నుంచి తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరపడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అక్షింతలు వేసింది. పోలీసుల నుంచి తుపాకీని తీసుకుని ఫైరింగ్ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆ తుపాకీతో ఏ రకమైన బుల్లెట్లు వాడి ఫైరింగ్ జరిపినా అది చట్టవిరుద్ధ చర్యే అవుతుందని క్లారిటీ ఇచ్చింధి. ప్రజల సమక్షంలో పబ్లిక్ ప్లేస్‌లో తుపాకీతో కాల్పులు జరపకూడదని వివరించింది.
కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటే దానికి దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం రెండు వారాల పాటు 'భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీకి పిలుపునిచ్చింది. క్రీడల శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస గౌడ్ ఈ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ టౌన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గార్డు (పోలీసు) నుంచి ఇన్సాస్ రైఫిల్ తీసుకుని వందలాది మంది యువత, ప్రజలు చుట్టూ ఉండగానే గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు సైతం అక్కడే ఉన్నారు. మంత్రి రైఫిల్ ఫైరింగ్‌ను వారించకపోగా ఉత్సాహపరిచారు.
పబ్లిక్ ప్లేస్‌లో, ప్రజలు గుమికూడి ఉన్న సందర్భంలో మంత్రి శ్రీనివాస గౌడ్ రైఫిల్ ఫైరింగ్ చేయడం ఆ సమయంల వివాదాస్పదమైంది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు మంత్రిని ప్రశ్నించారు. ఒక హీరోయిక్ యాక్షన్‌గా రైఫిల్ ఫైరింగ్‌కు పాల్పడడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైఫిల్ ఫైరింగ్ చర్యను మంత్రి సమర్ధించుకున్నారు. తుపాకీ ఫైరింగ్ వీడియోను కొన్ని శక్తులు దురుద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నాయని, దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. రైఫిల్ ఫైరింగ్ చేస్తున్న మంత్రి చర్యను పోలీసులు ప్రేక్షకులుగా చూస్తూనే ఉన్నారు తప్ప వారించకపోవడం కూడా ఆ టైమ్‌లో వివాదంగా మారింది. పబ్లిక్ ప్లేస్‌లో ఫైరింగ్ చేయరాదన్న నిబంధనల గురించి ఎస్పీ సహా పోలీసులకు తెలిసినా సైలెంట్‌గానే ఉండిపోయారు.
ఆర్మ్స్ రూల్స్ నాకు తెలుసు : మంత్రి
"నేను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని. నాకు ఆర్మ్స్ యాక్ట్ లోని రూల్స్ బాగా తెలుసు. నేనువాడిన గన్‌లో తూటాలు లేవు. ఫ్రీడమ్ ర్యాలీకి ప్రారంభసూచకంగా తుపాకీ ఫైరింగ్ చేశాను. అనేక క్రీడా పోటీలను ప్రారంభించడానికి కూడా ఇలాగే చేస్తారు. ఆ శాఖ మంత్రిగా గతంలోనూ ఇలానే చేశాను. స్వయంగా జిల్లా ఎస్పీయే నాకు ఇచ్చారు. మీరు అనుకుంటున్నట్లుగా అది నిజమైన గన్ కాదు. అందులో నిజమైన బుల్లెట్లూ లేవు. కేవలం రబ్బరు బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. వాటినే కాల్చాను" అని వివరణ ఇచ్చారు. మంత్రి అప్పుడు ఇచ్చిన వివరణ ఎలా ఉన్నా ప్రజలందరూ గుమికూడి ఉండగా పబ్లిక్ ప్లేస్‌లో ఎలాంటి గన్‌తోనైనా, ఏ బుల్లెట్లను వాడినా ఫైరింగ్ చేయడం తప్పేనని, చట్టవిరుద్ధమంటూ రైఫిల్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ నిమిత్ చోప్రా లిఖితపూర్వకంగా తెలియజేశారు.
పబ్లిక్ ప్లేస్‌లో ఫైరింగ్ చట్టవిరుద్ధం : అసోసియేషన్
మంత్రి శ్రీనివాసగౌడ్ జాతీయ రైఫిల్ అసోసియేన్ సభ్యుడేనని, గతేడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆయన లైఫ్ మెంబర్ (నెం. ఎల్-8764)గా కొనసాగుతున్నారని నిమిత్ చోప్రా వివరించారు. ఇప్పటికీ ఆయన సభ్యత్వం యాక్టివ్‌గానే ఉన్నదని ఈ నెల 15న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. జాతీయ రైఫిల్ అసోసియషన్ సభ్యులైనంత మాత్రాన గాలిలోకి కాల్పులు జరపడం చట్టవిరుద్ధ చర్యే అవుతుందని నొక్కిచెప్పారు. పోలీసు కానిస్టేబుల్ నుంచి సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్) తీసుకుని ఫైరింగ్ చేయడం కూడా తప్పేనని వివరించారు. రైఫిల్ అసోసియేషన్ నిబంధనలు ఇలాంటి ఫైరింగ్‌కు అనుమతించవన్నారు. అందులో నిజమైన బుల్లెట్లే కాకుండా ప్లాస్టిక్ సహా ఏ రకమైన బుల్లెట్లు వాడినా అది ఇల్లీగల్ యాక్షనే అవుతుందన్నారు.
తుపాకీని మంత్రి మిస్ యూజ్ చేయలేదు : ఎస్పీ వెంకటేశ్వర్లు
మంత్రి శ్రీనివాసగౌడ్ రైఫిల్ ఫైరింగ్‌పై ఆ సమయంలోనే జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. మంత్రి వాడిన తుపాకీ ఎస్ఎల్ఆర్ కాదని, ఇన్సాస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్ అని, అందులో లైవ్ బుల్లెట్లు లేవని, మ్యాగజైన్ సహా ఛాంబర్ అన్‌లోడ్‌లోనే ఉన్నదని వివరించారు. ఆ రైఫిల్‌లో ఎలాంటి లైవ్ బుల్లెట్లు లేనందున అది దుర్వినియోగమైనట్లుగా భావించడంలేదని మంత్రి చర్యలను సమర్ధించారు. సుమారు 20 వేల మంది ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొనేందుకు అక్కడ ఉన్నారని, ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా (సెర్మోనియల్) ప్రారంభించడానికి మంత్రి రైఫిల్ ఫైరింగ్ చేసినట్లు సమర్ధించుకున్నారు.
క్రీడా మంత్రిగా వివిధ పోటీలను ప్రారంభించేటప్పుడు గాలిలోకి కాల్పులు జరపడం ఆనవాయితీయేనని, జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా తనకు ఆర్మ్స్ రూల్స్ గురించి స్పష్టమైన అవగాహన ఉందంటూ గర్వంగా చెప్పుకున్నా ఆ అసోసియేషన్ సెక్రటరీయే సమాచార హక్కు చట్టం కింద నగరానికి చెందిన రాబిన్ చేసిన దరఖాస్తుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున, చట్టవిరుద్ధమంటూ స్పష్టంగా అసోసియేషన్ రాతపూర్వకంగా తెలియజేసినందున భవిష్యత్తులో మంత్రిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇరవై వేల మంది ప్రజల సమక్షంలో రైఫిల్ ఫైరింగ్‌ను హీరోయిక్ చర్యగా భావించిన పలువురికి అసోసియేషన్ ఇచ్చిన సమాధానం చెంపపెట్టులా పరిణమించింది.
Also Read: టీఆర్ఎస్‌పై ఎక్కడికక్కడ జనాగ్రహం.. సొంత నియోజకవర్గాల్లో మంత్రులకు చుక్కలు!