తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేటీఆర్.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-16 14:57:53.0  )
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేటీఆర్.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని.. ఇది అతి త్వరలోనే జరుగబోతోందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమని విమర్శించారు. కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని అడిగారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కవిత బెయిల్‌ విషయంలో కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది.

పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం. కేసీఆర్‌ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయం. అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపాలి. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed