డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశం

by Gantepaka Srikanth |
డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం డీజీపీ జితేందర్ కు ఫోన్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31న జైనూర్ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ(45)పై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతోపాటు తీవ్రంగా గాయపర్చడంతోపాటు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపీకి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆదివాసీ మహిళ కేసు పూర్వాపరాలను, ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాల అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నించడమే కాకుండా విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు కుట్ర చేసిన నిందితుడు షేక్ మగ్దూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై హత్య, అత్యాచారాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. ఢిల్లీలో గిరిరాజ్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పవర్ లూం క్లస్టర్ తో పాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో(యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేశారు. అట్లాగే ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని కోరారు. సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ను ఏర్పాటు చేయడంవల్ల వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్న్నారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతోపాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అట్లాగే యార్న్ డిపో ఏర్పాటువల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయని బండ తెలిపారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులవల్ల ముడిసరకులను కూడా కొనుగోలు చేయడం కష్టమైందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80 శాతం సబ్సిడీ, పావులా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed