ఇచ్చిన నోటిఫికేషన్‌కు బ్రేక్.. మళ్లీ దాని ఊసెత్తని టీఎస్​పీఎస్సీ!!

by GSrikanth |   ( Updated:2022-11-29 02:41:21.0  )
ఇచ్చిన నోటిఫికేషన్‌కు బ్రేక్.. మళ్లీ దాని ఊసెత్తని టీఎస్​పీఎస్సీ!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓవైపు నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం చేస్తున్న టీఎస్ పీఎస్సీ.. మరోవైపు ఇచ్చిన నోటిఫికేషన్లనూ పెండింగ్‌లో పెడుతోంది. ఆర్థిక శాఖ అనుమతి రాగానే కొలువుల జాతర అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం భర్తీ ప్రక్రియను మాత్రం వెయిటింగ్‌లో ఉంచుతోంది. ఇటీవల రవాణా శాఖలో అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్ పెక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించినట్టే చేసి ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీనికోసం ఇతర ఉద్యోగాలను వదులుకుని పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు రీ-నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ భర్తీ ప్రక్రియను టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా రవాణాశాఖ ద్వారా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పోస్టుల భర్తీలో అక్రమాలకు పాల్పడే చాన్స్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై రవాణా శాఖ మంత్రి నుంచి కనీసం సమాధానం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాంకేతిక సాకుతో పెండింగ్

రవాణాశాఖలో 113 ఏఎంవీఐ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. దీంతో ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్​రిలీజ్​అయింది. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్​5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత అసలు సమస్య తెరపైకి వచ్చింది. మొత్తం 113 పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులకు హెవీ మోటారు వెహికిల్​లైసెన్స్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు పెట్టారు. అంతకు ముందు మాత్రం మహిళలకు కొంత మేరకు సడలింపు ఉండేది. నియామకం తర్వాత కూడా రెండు నెలల సమయం తీసుకుని హెవీ మోటారు లైసెన్స్​ ను సమర్పించేవారు. కానీ, ఈసారి నిబంధనలను మార్చి, అప్లికేషన్​ సమయంలోనే హెవీ మెటారు వెహికిల్​ లైసెన్ష్​ ఉంటేనే అర్హులుగా ప్రకటించారు. దీనిపై కొంతమంది మహిళలు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు. దీన్ని పరిశీలించేందుకు సర్కారు కూడా ఆమోదం చెప్పింది. కానీ, దీనిపై ఎటూ తేల్చకపోవడంతో టీఎస్​పీఎస్సీ ఏఎంవీఐ పోస్టుల నోటిఫికేషన్‌ను విత్ డ్రా చేసుకుంది. త్వరలోనే మళ్లీ నోటిఫికేషన్​ ఇస్తామని ప్రకటించింది.

మరేమైంది..?

సర్వీసు రూల్స్ మార్పుపైనే చాలా విమర్శలు వచ్చాయి. వాస్తవంగా టీఎస్ పీఎస్సీ కూడా పాత నిబంధనలనే అమలు చేస్తూ నోటిఫికేషన్లు ఇస్తోంది. కానీ, ఏఎంవీఐ పోస్టుల్లో మాత్రం మార్పులు చేసింది. దీంతో వివాదం వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ భర్తీ ప్రక్రియను టీఎస్​పీఎస్సీ ద్వారా కాకుండా.. రవాణా శాఖ నేరుగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తెలుస్తోంది. అలా చేస్తే రవాణా శాఖలోని కొంతమంది ఆధ్వర్యంలో ఈ భర్తీ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ విషయంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు సైతం విన్నవించినా రిప్లై ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ నుంచి యధాతథంగా నియామకం చేసేందుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : TS: ఎస్ఐ, కానిస్టేబుట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే..!!

Advertisement

Next Story

Most Viewed