'పైకి గాంభీర్యం.. లోపల భయం!'.. గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన

by Vinod kumar |   ( Updated:2023-11-30 02:15:20.0  )
పైకి గాంభీర్యం.. లోపల భయం!.. గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో : పైకి గాంభీర్యం.. లోలోన ఆందోళన.. ఇదీ బీఆర్ఎస్ నేతల తీరు. మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా.. వారిలో గెలుస్తామా.. లేదా? అనే భయం మొదలైంది. కేడర్ లో భయాన్ని పోగొట్టి ధైర్యం నింపేందుకు బూత్ లెవల్ నేతలు, పోలింగ్ ఏజెంట్లతో పార్టీ అధిష్టానంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోల్ మేనేజ్ మెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి ఓటుపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ లిస్టులో పేరుంటేనే తాయిలాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కనిపించని సానుకూలత..

బీఆర్ఎస్ పార్టీ మూడు నెలలకు పైగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించింది. సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలను సైతం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై, గెలిస్తే చేయబోయే అంశాలపైనా వివరించారు. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన మేరకు సానుకూలత రాలేదని విశ్వసనీయ సమాచారం. రెండుసార్లు అధికారంలో ఉండటం, సీఎం కేసీఆర్ పై ప్రజల్లో అంచనాలు పెరగడం, సంక్షేమ పథకాలను అర్హులకు ఇవ్వలేదనే ఆరోపణలు, పెండింగ్ పనులు పూర్తి చేయలేదనే అసంతృప్తి ఉండటమే ఇందుకు కారణం. దీనికితోడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే మౌత్ టాక్, సర్వేల్లోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో గ్రామస్థాయిలో సైతం చర్చకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నా మళ్లీ వారికే టికెట్ ఇవ్వడంతో ప్రభుత్వం వ్యతిరేకత మరింత ఎక్కువైంది.

శ్రేణులకు భరోసా కల్పించే యత్నం..

పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టేందుకు బీఆర్ఎస్ అలర్టు అయింది. కాంగ్రెస్ పై మౌత్ టాక్ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావానికి చెక్ పెట్టేందుకు పార్టీ నేతల్లో భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం పార్టీ బూత్ లెవల్ నేతలు, పోలింగ్ ఏజెంట్లు, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జులతో పార్టీ అధిష్టానం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహం, పోల్ మేనేజ్ మెంట్ పై సైతం సూచనలు చేసినట్లు సమాచారం. మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని, అధికారంలోకి వస్తుందని భరోసా కల్పించినట్లు తెలిసింది.

ఓటర్ స్లిప్పులు చూపితేనే తాయిలాలు..

గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వారీగా ఉన్న ప్రతి ఇంటికీ నాయకులు వెళ్తున్నారు. ఎన్నికల ఆంక్షలు ఉండటంతో ఒక్కొక్కరుగా వెళ్లి ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్ లిస్టు ఆధారంగా ఓటర్లు స్లిప్పులు చూపితేనే తాయిలాలు ఇస్తున్నట్లు సమాచారం. తాయిలాలు ఇచ్చే ప్రతి ఓటర్ విధిగా ఓటువేసేలా చర్యలు తీసుకోవాలని, రెండులక్షల ఓటర్లు ఉంటే లక్షన్నర మందికి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకొని నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రతీ ఓటర్ కీలకమని భావించి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం రప్పించుకుంటున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతల్లో ఒకింత ఆందోళన స్టార్ట్ అయిందని వారి అహభావాల్లోనే స్పష్టమవుతుంది. అయితే ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed