టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు.. ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే సీరియస్

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-13 00:30:59.0  )
టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు.. ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీలు ఏళ్లు అవుతుందని కానీ పనులు మాత్రం పూర్తి కావడం లేదని పేర్కొంటూ ప్రశ్నల వర్షం కురిస్తున్నారు. పెండింగ్ పనులకు దీర్ఘకాలిక టెండర్లు కాకుండా షార్ట్ టైం టెండర్లు నిర్వహించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్య, మున్సిపల్, మద్యం దుకాణాలు ఇలా అన్ని రంగాలపై జరుగుతున్న అలసత్వంపై మండిపడుతున్నారు. శాసనసభా సమావేశాల్లోని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతి పక్షాలు సమస్యలపై గళం వినిపించకున్నప్పటికీ టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాఠశాల, ఆలయాలు, మసీదులు, గురుద్వార్ ల సమీపంలోనే వైన్ షాపులు, పర్మిట్ రూంలు ఉంటున్నాయని దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే మౌజంఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు అక్కడ అనుమతి ఇస్తున్నారని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే వెంకటవీరయ్య సైతం రెండున్నరేళ్ల క్రితం పేదలకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని వెంటనే భర్తీ చేసి నియామకం చేపట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నియామకం చేపట్టేవరకు విద్యావాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా రెండేళ్ల క్రితం విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని మనఊరు మనబడి పథకాన్ని ఎలా అమలు చేస్తారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య పెరిగిందని, దానిని అనుగుణంగా పథకాన్ని అమలు చేసి పాఠశాలలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో కరెంటు, వాటర్, మెయింటెన్స్ బిల్లుల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలకు మెయింటెన్స్, వాటర్, కరెంటు బిల్లులు ఇచ్చి జిల్లా, మండల పరిషత్ పాఠశాలకు కేవలం మెయింట్స్ బిల్లులు మాత్రమే ఇవ్వడంతో ఇబ్బందులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా తండాల్లో, గ్రామాల్లో విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కిందే విద్యనభ్యసిస్తున్నారని దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిచ విద్యపై నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, అంజయ్య యాదవ్ నిలదీశారు.

అదే విధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మతాశిశు కేంద్రాలు లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కోరారు. ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా వచ్చే అసత్య పోస్టులపై పోలీసులు వెంటనే స్పందించడం లేదనే భావన ఉందని ఇప్పటికైనా ఆదిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు. చేపలు, రొయ్యల క్వాలిటీపై అనుమానాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారని వాటి క్వాలిటీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో నాలాల అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీర్ఘకాలిక టెండర్ కాకుండా షార్ట్ టైం టెండర్ నిర్వహించాలని గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పైనుంచి నాలాల అభివృద్ధి కాకుండా కింది నుంచి చేపడితే వర్షాలకు ముంపు ప్రాంతాలు ముగిపోవని అన్నారు. వర్షాలు వస్తే మమ్మల్ని ప్రజలు నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు సైతం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎందుకు నడపడం లేదని మొహమ్మద్ మోజాం ఖాన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రశ్నించారు. ఇలా ప్రతి అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ హామీ ఇచ్చి పూర్తి చేయని, పెండింగ్ పనులు సైతం అదే స్థాయిలో ఉండటంతో ప్రజల పక్షాన సొంతపార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రజలపక్షాన తాము మాట్లాడుతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed