మేము వస్తే భూ సమస్యలు లేకుండా చేస్తాం.. మమ్ముల్ని ఉద్యోగంలోకి తీసుకోండి

by Bhoopathi Nagaiah |
మేము వస్తే భూ సమస్యలు లేకుండా చేస్తాం.. మమ్ముల్ని ఉద్యోగంలోకి తీసుకోండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ పారా లీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ అవసరం ఉందని, ప్రతి మండలంలోనూ భూ సమస్యల పరిష్కారంలో 10 సంవత్సరాల అనుభవం కలిగిన తమ సేవలను ఉపయోగించుకోవాలని పారా లీగల్ వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేసేందుకు, వారికి న్యాయ సలహాలు ఇచ్చేందుకు తాము ఉపయోగపడుతామన్నారు. మంగళవారం పారా లీగల్ వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య నేతృత్వంలోని బృందం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్యూనిటీ సర్వేయర్స్ ఐటీఐ డిప్లమా డిగ్రీలు కలిగి ఉన్నారని, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి శిక్షణ పొంది సర్వేపై పూర్తి పట్టు సాధించినట్లు చెప్పారు. మండల సర్వేయర్ల దగ్గర సర్వే ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వేలను చేసి వాటి హద్దు రాళ్లను పాతించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది కమ్యూనిటీ సర్వేయర్లు, 240 మంది పారాలీగల్స్ ఉన్నట్లు చెప్పారు. రెవెన్యూ సదస్సులు, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. 2014 తర్వాత సెర్ప్ లో బడ్జెట్ లేని కారణంగా భూమి విభాగాన్ని మూసి వేశారన్నారు. పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల చేత రెవెన్యూ పనులు చేయించాలని, ఆర్ఓఆర్ 2025 చట్టంలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి 2006 నుంచి 2014 వరకు ప్రతి పారా లీగల్, సర్వేయర్లు కృషి చేసినట్లు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, పేద రైతులకు అనుసంధానకర్తలుగా ఉంటూ లక్షల భూ సమస్యలు పరిష్కారం చేశామని వివరించారు.

రెవెన్యూలోకి తీసుకోండి

తెలంగాణలో పారాలీగల్స్‌ని రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కోరారు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వీరి అవసరం ఉంటుందన్నారు. తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసినప్పుడు వీరంతా భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ చట్టాలపై శిక్షణ పొందారని, వారంతా కొంత కాలం క్షేత్ర స్థాయిలో పని చేసినట్లు వివరించారు.

Next Story

Most Viewed