తెలంగాణలో పొలిటిషియన్స్‌పై దాడుల వెనక ‘పీకే’ హస్తం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-12 14:44:18.0  )
తెలంగాణలో పొలిటిషియన్స్‌పై దాడుల వెనక ‘పీకే’ హస్తం: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘తెలంగాణలోని ప్రజా ప్రతినిధుల దాడుల వెనక పీకే(ప్రశాంత్ కిషోర్) ఉన్నాడు. 2018 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశాఖ ఎయిర్ పోర్టు కత్తిపోట్లు, 2021 వెస్ట్ బెంగాల్ టీఎంసీ అధినేత మమత బెనర్జీ దాడులన్నీ పీకే మదిలో నుంచి పుట్టిన సురభి నాటకాలు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకే ఎన్నికల సమయంలో పీకే ఇలాంటి వ్యూహాలను అందజేస్తుంటాడు. ప్రజలంతా దీన్ని గమనించాల్సిన​అవసరం ఉన్నది. కాంగ్రెస్‌ను బద్నం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లోని ప్లాన్‌లను పీకే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి అంచును ఉన్న బీఆర్ఎస్‌ను గట్టేక్కించేందుకు పీకే తన మెదడుకు పదును పెడుతున్నారన్నారు.

దీనిలో భాగంగానే ప్రజాప్రతినిధులపై దాడులు, ఆసుపత్రుల్లో అడ్మిషన్లు వంటివి జరుగుతున్నాయన్నారు. ప్రజల వ్యతిరేకతను తగ్గించి, సానుభూతిని పెంచేలా బీఆర్ఎస్ తన స్ట్రాటజిస్టు సలహాలతో కొత్త కుట్రలకు తెరలేపిందన్నారు. రాబోయే పదిహేను రోజుల్లో మరో మూడు దాడులు జరిగే ఛాన్స్ ఉన్నదని కేటీఆర్ ముందస్తుగా చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. దాడులు జరుగుతున్నాయని? కేటీఆర్‌కు ముందే తెలుసా? అయితే ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది? అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కత్తిపోట్లు, ఆసుపత్రుల నాటకాలను ప్రజలు నమొద్దని సూచించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడులు ఇదే తరహాలోని అని రేవంత్ ఆరోపించారు. కత్తిపోటు తర్వాత ఎంపీ ఆసుపత్రికి చేరకముందే హరీష్ రావు అక్కడికి చేరుకొని హంగామా క్రియేట్ చేశాడన్నారు. స్కెచ్‌లలో భాగంగానే దాడులు నాటకాలన్నారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచిపెడుతుంటే యువకులు అడ్డుకున్నారని, దీన్ని తట్టుకోలేని బాలరాజు దాడులు పేరిట డ్రామాలాడుతున్నారన్నారు.

ఫోన్లు హ్యాకింగ్..

ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు హ్యాకింగ్ అవుతాయని రేవంత్ విమర్శించారు. దీంతో పాటు కొంత మంది మీడియా ఉద్యోగుల ఫోన్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తుందని రేవంత్ ఆరోపించారు. రిటైర్డ్ అధికారులను ప్రైవేట్ సైన్యంగా వాడుకొని కేసీఆర్ ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నాడన్నారు. ఏపీకి చెందిన అధికారులను వెంటనే తిప్పి పంపకపోతే, తమ ప్రభుత్వం రాగానే చర్యలు తప్పవన్నారు. దీంతోపాటు బీఆర్ఎస్‌కు మద్ధితిస్తున్న ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story