మంత్రి పొన్నం ఆర్డర్.. తమిళనాడులో తెలంగాణ రవాణా శాఖ అధికారుల టూర్

by Satheesh |
మంత్రి పొన్నం ఆర్డర్.. తమిళనాడులో తెలంగాణ రవాణా శాఖ అధికారుల టూర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాలు రవాణాశాఖలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఐదు రాష్ట్రాలను ఎంచుకుంది. ఇప్పటికే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో బృందాలు పర్యటించగా, తమిళనాడుకు రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం అధికారుల బృందం వెళ్లింది. మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆదేశాల మేరకు వెళ్లారు. ఆ బృందంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ జింగ్లి శ్రీనివాస్ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. తమిళనాడు రవాణా శాఖ కమిషనర్ షణ్ముగ సుందరంతో భేటీ అయ్యారు.

9 కీలక అంశాలైన ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్, రిజిస్ట్రర్డ్ వెహికిల్ స్ర్కాపింగ్ ఫెసిలిటీ, వాహన్/సారధి, చెక్ పోస్టుల ఎత్తివేత, ఆటెమేటెడ్ డ్రైవింగ్ టెస్టు ట్రాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సీ డిజిటల్/స్మార్ట్ కార్డు, టాక్సెషన్ షెడ్యూల్, గత మూడేళ్ల నుంచి రెవెన్యూ, మెయింటెన్స్ ఆఫ్ సెల్ప్ లైఫ్ ఆఫ్ రికార్డు తదితర అంశాలపై తమిళనాడులో అమలవుతున్న తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నట్లు డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయాల నిర్వహణ, పనితీరును పరిశీలించనున్నారు. తెలంగాణ అధికారుల బృందం అధ్యయనానికి తోడ్పాటుగా తమిళనాడు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేష్, ఆర్టీవో సంపత్ కుమార్, ఎంవీఐ కార్తీక్‌లను తమిళనాడు రవాణా శాఖ నియమించింది. అధ్యాయనం చేసిన అంశాలను సవివరంగా త్వరలోనే కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తామని చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.

Next Story