Bhatti Vikramarka: రేపు ప్రతి మండలంలోని ఓ గ్రామంలో నూరు శాతం 4 స్కీమ్స్: భట్టి

by Prasad Jukanti |
Bhatti Vikramarka: రేపు ప్రతి మండలంలోని ఓ గ్రామంలో నూరు శాతం 4 స్కీమ్స్: భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా (Rythu Bharosa), ఆత్మీయ భరోసా(Indiramma Atmiya Bharosa), ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses), రేషన్ కార్డులకు (Ration Cards) సంబంధించిన నాలుగు పథకాలను లాంచనంగా ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. శనివారం బంజారా హిల్స్‌ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఈ నాలుగు పథకాలు రేపు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోరని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని, భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని చెప్పారు.

రేపు మధ్యాహ్నం 1 గంటకు పథకాలు లాంచ్: ఉత్తమ్

రేపు ఉదయం 11:30 గంటల వరకు రిపబ్లిక్ డే వేడుకులు నిర్వబహించుకుని మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల వరకు నాలుగు సంక్షేమ పథకాలను మండలంలోని ఓ గ్రామంలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఎంపిక చేసిన గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. రేషన్ కార్డులు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామన్నారు. రేపటి నుంచి సాగు చేసే ప్రతి భూములకు రైతుభరోసా కింద ఎకరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందజేయబోతున్నామని మంత్రి తుమ్మల (Thummala Nageswara Rao) చెప్పారు.

మిగతా చోట్లకు ఫిబ్రవరిలో షెడ్యూల్: మంత్రి పొంగులేటి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో రేపు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ప్రతి అంశాన్ని ప్రజల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఈ ప్రభుత్వానిదని, అందుకే గ్రామసభలు నిర్వహించి ప్రజల వద్దనుంచి అప్లికేషన్లు స్వీకరించామన్నారు. గ్రామసభల్లో ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. కొత్తగా వచ్చిన అప్లికేషన్ల కారణంగా రేపు మండలానికి ఓ గ్రామంలో నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామని మిగతా చోట్ల ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. అర్హులైన పేదవారెవరూ అభద్రతకు లోనుకావాల్సిన అవసరం లేదన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రైతు కమిటీలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఎంత గింజుకున్నా చిత్తశుద్ధితో ఈ నాలుగు పథకాలు అమలు చేస్తామన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. మాది మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదన్నారు. మేము చేస్తున్న మంచిని ప్రతిపక్షాలు అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ చెడుగా చిత్రీకరించాలనే ప్రయత్నంలో విమర్శల పాలుకావొద్దని సూచించారు. పొరపాటున అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తే వాటిని రద్దు చేయడానికి వెనుకాడమన్నారు.

Next Story