అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ BR.అంబేద్కర్: నేడు ఆయన 132వ జయంతి

by Javid Pasha |   ( Updated:2023-04-13 18:45:24.0  )
అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ BR.అంబేద్కర్: నేడు ఆయన 132వ జయంతి
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశాన్ని అనాదిగా పీడిస్తోన్న అది పెద్ద సమస్య కులం. మనిషి తెలివిని బట్టి గాక పుట్టుకను ఆధారం చేసుకొని సమాజంలో అతడి స్థితిని నిర్ణయించే అత్యంత దుర్మార్గమైన ఆచారం ఈ కులం నుంచి వచ్చిందే. అవసరాన్ని బట్టి వేల కులాలను పుట్టించి మనుషుల మధ్య అడ్డుగోడలను వేశారు కొందరు. కులం పేరుతో ఎన్నో అరాచకాలు.. మరెన్నో దారుణాలు. కోట్లకొద్దీ భారతీయులు కులం కోరల్లో చిక్కుకొని పురుగుల కంటే హీనంగా చూడబడుతున్న రోజుల్లో ధృవతారలా వచ్చాడు బాబా సాహెబ్ అంబేంద్కర్. దళితులపై అకృత్యాలకు మూల కారణమైన మను స్మృతిని దహనం చేసి అణగారిన వర్గాల్లో ధైర్యం నింపిన సాహసి. ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించాడు. ఒక్క కలం పోటుతో కులాన్ని పాతాళానికి తొక్కేశాడు. మనమంతా ఒక్కటేనని చాటి చెబుతూ భారతీయతకు కొత్త నిర్వచనమిచ్చాడు. కోట్లకొలది అణగారిన జనాల ఆశాదీపం, ప్రపంచ మేధావి బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఈ రోజు (ఏప్రిల్ 14). మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మహర్ కులానికి చెందిన రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతులకు 1891 ఏప్రిల్ 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు.


శత్రువుపై యుద్ధానికి కత్తి అవసరం.. సమాజంలోని అసమానతపై పోరాటానికి విద్య అవసరమని పిలుపునిచ్చిన మార్గదర్శి అంబేడ్కర్​ 132వ జయంతి అంబేడ్కర్ గురించి కొన్ని విషయాలు..

- అంబేద్కర్ కు ‘భారత రత్న’ పురస్కారాన్ని ఆయన మరణానంతరం 1990లో కాంగ్రెసేతర ప్రభుత్వం ఇచ్చింది.

- ‘ప్యూన్ లేడు.. నీళ్లు లేవు’ అని అంబేడ్కర్ అన్నాడు. అంటే.. దళితుడైన అంబేడ్కర్ స్కూళ్లో ఇతర పిల్లలతో కలవకుండా ఒక మూలన కూర్చోవాల్సి వచ్చేది. దాహం వేస్తే ప్యూన్ వచ్చి నీళ్లు ఇచ్చే వాడు. ప్యూన్ లేకుంటే దాహం తీరేది కాదు.

- అంబేద్కర్ మహారాష్ట్రలోని ‘మెహర్’ అనే దళిత కుటుంబంలో జన్మించారు.

- అంబేద్కర్ 9 ఏళ్ల వయసులో మాసూర్ నుంచి గోరేగావ్ కు వెళ్లాలి. ఎడ్ల బండి వాళ్లు అతడిని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో బండి వాడికి రెండింతలు కిరాయి ఇచ్చారు. పైగా అంబేడ్కర్ సోదరులే బండి నడుపుకొని వెళ్లారు. బండి వాడు వీళ్లకు దూరంగా వెనుక నడిచాడు.

- అంబేద్కర్ పేరును స్కూల్ రిజిస్టర్‌లో ‘భీవా అంబేద్కర్’గా నమోదు చేశారు. ఆయన రిజిస్ట్రేషన్ నంబరు 1914. పేరుకు పక్కనే అంబేద్కర్ సంతకం కూడా ఉంది. ఈ రిజిస్టర్ ఇప్పటికి ఈ పాఠశాలలో భద్రంగా ఉంది.

- విదేశాల్లో చదివిన తర్వాత బరోడా సంస్థానంలో పదేళ్ల పాటు పని చేయాలన్న షరతుపై బరోడా మహారాజు శాయాజీరావ్ అందించిన ఆర్థిక సాయంతో అంబేద్కర్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఎం.ఎ., పీహెచ్ డీ చేశారు. తర్వాత బరోడా సంస్థానంలో సైనిక కార్యదర్శిగా పని చేశారు.

- 1926లో లాయర్ గా ప్రాక్టీసు చేసినప్పుడే అంటరానితనంపై అంబేద్కర్ తొలిసారి పిడికిలి బిగించారు. ‘బహిష్కృత హితకారిణి సభ’ అనే సంస్థ ఏర్పాటు చేసి దళితుల కోసం పాటుపడ్డారు.

- 1945లో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో లేబర్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న అంబేద్కర్ అప్పటి ఒరిస్సాలోని జగన్నాథ ఆలయానికి వెళ్లగా.. కులం కారణంగా ఆయన్ను లోపలికి రానివ్వలేదు.

- భారత రాజ్యాంగాన్ని రచించే కమిటీలో ఏడుగురు సభ్యులు. అందులో ఐదుగురు అగ్రకులాల వారే ఉన్నారు. అయినా.. ఈ కమిటీకి అంబేద్కర్ నేతృత్వం వహించేందుకు వారు అంగీకరించారు.


- భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు అంబేద్కర్ కు ఇవ్వాలని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలకు ఐర్లాండ్ రాజ్యంగ నిర్మాత ఏమన్ డీ వలేరా సూచించారు. అంబేద్కర్ కు మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా రాసిన లేఖలో ఈ విషయం ప్రస్తావించారు.

- భారత్ లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా..? అని బీబీసీ 1953లో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ‘విజయవంతం కాదు’ అని అంబేద్కర్ సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యం నామమాత్రంగా, లాంఛనప్రాయంగానే కొనసాగుతుందన్నారు.

- భారత్ లోని సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అనువైనది కాదని అంబేద్కర్ అన్నారు.

- అంబేద్కర్ సంతోషంలో ఉంటే బుద్ధ వందన, కబీర్ దోహాలను పాడుకునేవారని ఆయన భార్య సవితా అంబేడ్కర్ తెలిపారు.

- విదేశాల్లో ఎకనామిక్స్ నుంచి పీహెచ్​డీ పొందిన తొలి భారతీయుడు అంబేద్కర్.

- ఆ రోజుల్లో అంబేద్కర్ లా ఉన్నత చదువులు చదివిన వ్యక్తి మరొకరు ఉండక పోవచ్చు. అప్పటి బాంబేలోని ప్రసిద్ధ ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి బీఏ పట్టా పొందారు. తరువాత కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ నుండి పీహెచ్‌డీ పొందారు.

- అంబేడ్కర్ పుస్తక ప్రియుడు. ఆయన మరణించే నాటికి ఆయన అల్మారాలో 35 వేల పుస్తకాలు ఉన్నాయి.

- తనపై మూడు పుస్తకాలు ఎక్కువ ప్రభావం చూపాయని అంబేద్కర్ చెప్పేవారు. మొదటిది 'లైఫ్‌ ఆఫ్‌ టాల్‌స్టాయ్', రెండోది విక్టర్‌ హ్యూగో 'లే మిజ్రబేల్‌', మూడోది థామస్‌ హార్డీ రాసిన 'ఫార్ ఫ్రమ్ ది మాడింగ్‌ క్రౌడ్.'

- ప్రపంచంలో 100 మంది అత్యుత్తమ మేధావుల జాబితాను కొలంబియా యూనివర్సిటీ 2004లో తయారు చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు అంబేద్కర్ ​ది! ఆయన రాసిన 'వెయిటింగ్​ ఫర్ ఎ వీసా' పుస్తకం కొలంబియా వర్సిటీలో ఓ పాఠ్యపుస్తకం.


- అంబేద్కర్ కు 64 సబ్జెక్ట్​లలో మాస్టర్స్ డిగ్రీ ఉంది! హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్​, ఫ్రెంచ్, జర్మన్​, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి భాషలు ఆయనకు తెలుసు.

- లండన్ స్కూల్​ఆఫ్ ఎకనామిక్స్​లో 8 ఏళ్ల కోర్సును అంబేడ్కర్ 2 ఏళ్ల 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదివేవారు.

- అంబేద్కర్ తో పాటు 8,50,000 మంది ఆయన అనుచరులు బౌద్ధమతంలోకి మారారు. ప్రపంచంలో మతమార్పిడి విషయంలో ఇప్పటికీ ఇదే అతిపెద్దది!

- ప్రపంచవ్యాప్తంగా.. మంచి నీటి కోసం సత్యాగ్రహం చేసిన తొలి, ఏకైక వ్యక్తి అంబేద్కర్.

- వెనకబడిన వర్గాల నుంచి వచ్చి లాయర్​గా ఎదిగిన తొలి వ్యక్తి అంబేద్కర్.

- అంబేద్కర్ తొలి విగ్రహాన్ని 1950లో నిర్మించారు. అది కొల్హాపూర్​లో ఉంది. అప్పటికి అంబేద్కర్ జీవించే ఉన్నారు.

- 1956 అక్టోబరు 14వ తేదీన బౌద్ధ మతాన్ని స్వీకరించిన అంబేద్కర్ అదే ఏడాది డిసెంబరు 6వ తేదీన మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed