TNGO అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ రాజీనామా

by GSrikanth |
TNGO అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వ సర్వీసు నుంచి తప్పుకున్నారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ ఆఫీసులో సూపరింటెండ్‌గా పనిచేస్తున్న రాజేందర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. డిపార్టుమెంటులో ఇరవై సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకోవడంతో స్వచ్చందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆమోదం లభించింది. వాలంటరీ రిటైర్‌మెంట్ కోసం జూలై 12న రంగారెడ్డి జిల్లా వైద్యాధికారికి మామిళ్ళ రాజేందర్ దరఖాస్తు చేసుకోగా మూడు రోజుల తర్వాత అది రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయానికి చేరింది. ఇరవై ఏండ్లకు పైగా సర్వీసు అందించానని, ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో రిటైర్ కావాలనుకుంటున్నట్లు అందులో రాజేందర్ పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన డీహెచ్.. ఆమోదం తెలిపారు. ఆ ప్రకారం అక్టోబరు 20 మధ్యాహ్నం తర్వాత విధుల నుంచి తప్పుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

ఇదిలా ఉండగా గతంలో టీఎన్జీవో అధ్యక్షుడిగా దీర్ఘకాలం పనిచేసిన స్వామిగౌడ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో అధికార పార్టీ (బీఆర్ఎస్)లో చేరారు. ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా పనిచేశారు. ఆ పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి అవకాశం రాకపోవడంతో బీజేపీలో చేరారు. ఎక్కువకాలం ఆ పార్టీలో కొనసాగలేకపోయారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు అదే తరహాలో మామిళ్ళ రాజేందర్ సైతం టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉంటూ అధికార పార్టీలో చేరేందుకుగాను స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా సర్వీసు నుంచి తప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో లాంఛనంగా పార్టీలో చేరనున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మామిళ్ళ రాజేందర్ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన చింతా ప్రభాకర్‌కే ఈసారి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీంతో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నామినేటెడ్ పదవి లభించే అవకాశం లేదు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టు దక్కించుకుంటారా?.. లేక ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తుందా?.. లేక మెదక్ నుంచి ఎంపీగా పోటీచేసే ఛాన్స్ వస్తుందా?.. ఇవన్నీ ఊహాగానాలుగా ఉన్నాయి.

Advertisement

Next Story